యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ 20 అమెరికా సైనిక స్థావరాలను ధ్వంసం చేసిందని, బహిరంగంగా అంగీకరించిన దానికంటే ఈ దాడులు చాలా విస్తృతంగా జరిగాయని బీబీసీ విశ్లేషించిన ఉపగ్రహ చిత్రాలు, వీడియోలు సూచిస్తున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నుండి ఇరాన్ మధ్యప్రాచ్యంలోని ఎనిమిది దేశాల్లోని కీలక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది.
దీనివల్ల అత్యాధునిక వాయు రక్షణ వ్యవస్థలు, ఇంధనం నింపే విమానాలు, రాడార్లకు మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. గత మూడు నెలలుగా ఇరాన్, లెబనాన్‌లలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్, అమెరికా స్థావరాలను, ఉమ్మడి సైనిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్‌లో 13,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్లు పెంటగాన్ చెబుతోంది.
ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ, అమెరికా సదుపాయాలపై దాడులలో తన సైన్యం సాధించిన విజయాన్ని ప్రముఖంగా చాటుకోవడానికి ప్రయత్నించారు. మంగళవారం ఒక ప్రకటనలో, మధ్యప్రాచ్యం ఇకపై అమెరికా స్థావరాలకు “సురక్షితమైన ప్రదేశం” కాదని ఆయన హెచ్చరించారు. ఇరాన్ సైన్యం దాదాపుగా నాశనమైందని వైట్ హౌస్ పదేపదే చెబుతున్నప్పటికీ, అమెరికా స్థావరాలలో కనిపించిన నష్టాన్ని బట్టి, టెహ్రాన్ ప్రతిదాడులు అమెరికా అధికారులు గతంలో అంగీకరించిన దానికంటే మరింత కచ్చితమైనవిగా, విస్తృతమైనవిగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సంఘర్షణపై ఉపగ్రహ విశ్లేషణను పరిమితం చేయడానికి, అమెరికా ఒక ప్రధాన ప్రొవైడర్ అయిన ప్లానెట్‌ను, ఇరాన్, మధ్యప్రాచ్యంలోని చాలా ప్రాంతాల కొత్త చిత్రాలపై “నిరవధిక” ఆంక్ష విధించమని కోరింది. తమ చిత్రాలను “శత్రు శక్తులు మిత్ర, నాటో భాగస్వామ్య దేశాల సిబ్బందిని, పౌరులను లక్ష్యంగా చేసుకోవడానికి” ఉపయోగించకుండా చూసుకోవాలనుకుంటున్నట్లు ఆ సంస్థ ఈ చర్యను సమర్థించుకుంది.
ఇరాన్ దాడుల వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించడానికి బీబీసీ వెరిఫై, ప్లానెట్ నుండి పాత చిత్రాలతో పాటు ఇతర అంతర్జాతీయ ప్రొవైడర్ల ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించింది. ఈ స్థావరాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్, కువైట్, ఇరాక్, జోర్డాన్, బహ్రెయిన్, ఒమన్‌లలో ఉన్నాయి. వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చు.
కొంతమంది విశ్లేషకులు దెబ్బతిన్న స్థావరాల సంఖ్యను 28 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దెబ్బతిన్న విలువైన పరికరాలలో యూఏఈలోని అల్ రువైస్, అల్ సదర్ వైమానిక స్థావరాలు, అలాగే జోర్డాన్‌లోని మువఫ్ఫాక్ సాల్టీ వైమానిక స్థావరం వద్ద ఉన్న మూడు అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి నిరోధక బ్యాటరీ వ్యవస్థలు ఉన్నాయి. అమెరికా కేవలం ఎనిమిది టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (తాడ్) బ్యాటరీలను మాత్రమే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థావరాలలో మోహరించబడి ఉంటాయి. వీటి తయారీకి సుమారు $1 బిలియన్ (£766 మిలియన్లు) ఖర్చవుతుంది. ప్రతి బ్యాటరీని ఆపరేట్ చేయడానికి సుమారు 100 మంది సైనికుల సిబ్బంది అవసరం కాగా, అది ప్రయోగించే ఇంటర్‌సెప్టర్‌లకు ఒక్కో రౌండ్‌కు సుమారు $12.7 మిలియన్లు ఖర్చవుతుంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌లో ఉన్న అమెరికా రీఫుయలింగ్, నిఘా విమానాలపై కూడా ఇరాన్ దాడి చేసింది.
శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా దీన్ని స్పష్టంగా అంచనా వేశారు. సుమారు 700 మిలియన్ల డాలర్ల ఖరీదైన ఈ-3 సెంట్రీ నిఘా ప్లేన్‌ను కూడా పేల్చినట్లు గుర్తించారు. కువైట్‌లో ఉన్న అలీ అల్ సలీమ్ ఎయిర్‌బేస్‌తో పాటు క్యాంప్ అరిఫ్‌జాన్‌లో ఉన్న బేస్‌ను కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. సైట్ వద్ద ఫ్యూయల్ స్టోరేజ్ బంకర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్లు, ట్రూప్ అకామిడేషన్ ప్రాంతాలు ధ్వంసం అయినట్లు మలార్ శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించారు.
అమెరికా సౌకర్యాలకు జరిగిన నష్టాన్ని లెక్కించడం కష్టం, కానీ మే నెలలో పెంటగాన్ చేసిన అంచనా ప్రకారం ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ మొత్తం ఖర్చు 29 బిలియన్ డాలర్లు. ఇందులో అధిక భాగం, ఈ సంఘర్షణలో ధ్వంసమైన “పరికరాల మరమ్మత్తు లేదా భర్తీ ఖర్చుల”కే వెచ్చించే అవకాశం ఉంది. ఇది వాస్తవ అంచనా కంటే తక్కువ అని డెమోక్రాట్లు అంటున్నారు.
ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు కనీసం 42 విమానాలు – వీటిలో ఎఫ్-15, ఎఫ్-35 యుద్ధ విమానాలు, 24 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు, ఒక ఏ-10 దాడి విమానం ఉన్నాయి – ధ్వంసమయ్యాయని లేదా దెబ్బతిన్నాయని కూడా ఆ నివేదికలో వెల్లడైంది. అమెరికా సైన్యం ఉపయోగించే ఖరీదైన పరికరాలతో పోలిస్తే, ఇరాన్ మధ్యప్రాచ్యంలోని లక్ష్యాలపై తన దాడులలో చవకైన, సులభంగా మార్చగల డ్రోన్లను ఉపయోగించినట్లు సమాచారం.

More Stories
జమ్ముకశ్మీర్ లో మొదటిసారి ఉగ్రవాద మరణాలు లేని మే నెల!
మయన్మార్ భూభాగాన్ని భారత్ కు వ్యతిరేకంగా అనుమతించం!
అమెరికాతో చర్చలేవ్.. ఇక హర్మూజ్ దిగ్బంధం