అమెరికాతో చర్చలేవ్.. ఇక హర్మూజ్ దిగ్బంధం

అమెరికాతో చర్చలేవ్.. ఇక హర్మూజ్ దిగ్బంధం
* లెబనాన్‌పై దాడుల పట్ల ట్రంప్ ఆగ్రహం.. నెతన్యాహుతో తీవ్ర వాగ్వాదం
అమెరికాతో ఇకపై ఎటువంటి చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ సోమవారం ప్రకటించింది. మధ్యవర్తులతో అమెరికాకు ఎటువంటి సందేశాలు వెలువరించే దశ దాటిపోయిందని తేల్చిచెప్పారు. ఓ వైపు ఇజ్రాయెల్ బలగాలు బరి తెగించి లెబనాన్, గాజాలలో సైనిక చర్యలకు దిగుతున్నాయి, ఇతరత్రా కవ్వింపు చర్యలతో అమెరికా దూసుకుపోతోంది. 
ఈ దశలో చర్చలు, సబంధిత వర్తమానాలు, దూతలతో రాయబారాల దశ దాటిపోయినట్లే అని ఇరాన్ నాయకత్వం స్పష్టం చేసిందని ఇరాన్ వార్తా సంస్థ తస్నీమ్ తెలిపింది. 
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణ సరైన చర్య అన్పించుకుంటుందా? అని ఇరాన్ నేతలు ప్రశ్నించారు.  లెబనాన్‌పై దాడులు జరగరాదనేది కాల్పుల విరమణకు ముందస్తు షరతు. అయితే దీనిని అన్ని విధాలుగా ఉల్లంఘించారని , ఇక కాల్పుల విరమణకు అర్థం లేదని ఇరాన్ అధికారికంగా ప్రకటించినట్లు వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్ సేనలు పూర్తి స్థాయిలో హర్మూజ్‌ను దిగ్బంధించేందుకు సిద్ధపడుతున్నాయి.  బాబ్ ఎల్ మందెబ్ జలమార్గాన్ని కూడా నిలిపివేస్తారు. 
 

కాల్పుల విరమణ అనేది అన్ని స్థాయిల్లో ఉండాలి. లేకపోతే దీనితో ఫలితం ఉండదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచి తమ ప్రకటనలో తెలిపారు.  లెబనాన్ వంటి తమ మిత్రపక్షాలపై ఇజ్రాయెల్ దాడులు ఆపనంతవరకు, వారి సూచనల్ని పరిగనణలోకి తీసుకోనంత వరకు చర్చలు జరిపేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఇంకోవైపు ట్రంప్‌ మాత్రం చర్చలు బాగా జరుగుతున్నాయని, మంచి ముగింపు వస్తుందంటూ వరుస పోస్టులు పెడుతున్నారు.

దీంతో పశ్చిమాసియా లో యుద్ధం ముగుస్తుందా కొనసాగుతుందా అనే టెన్షన్‌ ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. వారాంతంలో అమెరికన్‌ డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేసిన నేపథ్యంలో ఇందుకు ప్రతీకారంగా సోమవారం ఇరాన్‌లోని రాడార్‌, డ్రోన్‌ కేంద్రాలపై బాంబు దాడులు జరిపినట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా సైనిక సెంట్రల్‌ కమాండ్‌ శని, ఆదివారాల్లో ఇరాన్‌లోని గేరుక్‌ నగరం చుట్టూ, ఖైష్మ దీవిపై దాడులు జరిపింది. 

అంతర్జాతీయ జలాలపై కార్యకలాపాలు సాగిస్తున్న యూఎస్‌ ఎంక్యూ-1 డ్రోన్‌ను కూల్చివేయడంతో ఇరాన్‌ దుందుడుకు చర్యలకు సమాధానంగా దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. సోమవారం లెబనాన్ రాజధాని బీరుట్ పరిసర ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. నిజానికి ఇప్పటికే లెబనాన్‌పై ఇజ్రాయెల్ పట్టుసాధించినట్లు తెలుస్తోంది. లెబనాన్ భూభాగంలోకి ఇజ్రాయెల్ దళాలు చొచ్చుకెళ్లాయి.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ దక్కించుకుంది. లెబనాన్‌పై దాడులు చేయాల్సిందిగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ఆదేశించారు.   లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా వరుసగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటం వల్లే తాము దాడులు చేస్తున్నామని ప్రకటించింది. ఇదే సమయంలో హెజ్‌బొల్లా కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేసింది. అక్కడి తీర ప్రాంతమైన హైఫా ప్రాంతంలో దాడులు చేసినట్లు తెలుస్తోంది. అయితే, హెజ్‌బొల్లా దాడుల్ని తాము తిప్పికొట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

మరోవంక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో తీవ్ర వాగ్వాదం జరిపినట్లు, లెబనాన్‌లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడులను ఆయన తీవ్రంగా విమర్శించినట్లు, ఆ సంభాషణ గురించి తెలిసిన అమెరికా అధికారులు, ఒక మూలాన్ని ఉటంకిస్తూ ఆక్సియోస్ నివేదిక పేర్కొంది. 

ఇజ్రాయెల్ చర్యలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారని, కొనసాగుతున్న బాంబు దాడులు దేశ అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని హెచ్చరించినట్లు ఆ నివేదిక తెలిపింది.  ట్రంప్ నెతన్యాహును అసాధారణంగా తీవ్రమైన పదజాలంతో మందలించి, పరిస్థితిని ఆయన నిర్వహించిన తీరును ప్రశ్నించారు.  ఆ పత్రిక ఉటంకించిన ఒక అమెరికా అధికారి ప్రకారం, ట్రంప్ నెతన్యాహును కృతఘ్నుడని ఆరోపించారు. తన రాజకీయ మనుగడకు అమెరికా మద్దతే దోహదపడిందని వాదించారు. బీరూట్‌పై దాడి చేస్తామని నిరంతరం బెదిరించడం ఇజ్రాయెల్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత ఏకాకిని చేస్తుందని కూడా ట్రంప్ హెచ్చరించినట్లు సమాచారం.