రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించి, బాక్సీఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ‘దురంధర్’ సినిమా మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ‘డి-కంపెనీ’లో తీవ్ర కలకలం రేపినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విజయవంతమైన వెంటనే పాకిస్థాన్ నుంచి దావూద్ నడుపుతున్న డి గ్యాంగ్ ముంబయిలోని తమ నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
దురందర్‌లోని ‘బడే సాహెబ్’ పాత్ర దావూద్ ఇబ్రహీం పోలికలను స్పష్టంగా ప్రతిబింబించడమే కాకుండా, అతడు చనిపోయాడనే అర్థం వచ్చేలా దృశ్యాలు ఉన్నాయి. దీంతో దావూద్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని ప్రజలకు నమ్మించాల్సిన అవసరం డి-కంపెనీకి ఏర్పడిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తమ ఉగ్ర కుట్రను అమలు చేయడానికి దావూద్ గ్యాంగ్ ఎదుర్కొన్న మొదటి సవాల్ కొత్త సభ్యులను వెతకడమని చెబుతున్నారు.
రిక్రూట్‌మెంట్ ప్రక్రియను షకీల్ గ్యాంగ్‌కు, వారికి శిక్షణ ఇచ్చి ఆయుధాలు అందించే బాధ్యతను పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకి అప్పగించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద కుట్రను అమలు చేసే బాధ్యతను షూటర్ మున్నా జింగాడాకు అప్పగించినట్లు చెప్పారు. అయితే, రిక్రూట్ అయిన యువకులకు ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు కారణాన్ని గ్యాంగ్ చెప్పలేదు.
ముంబయి వీధుల నుంచి అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేసిన ఈ యువకులను, బాంద్రా గరీబ్ నగర్‌లోని ఒక అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను చూపించి, వారిలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి ఈ కుట్రలోకి లాగారని పేర్కొన్నాయి. ఇటీవల ఢిల్లీ పోలీసులు ఉగ్రకుట్రను భగ్నం చేయడంతో ఐఎస్‌ఐకి, ముంబయి అండర్ వరల్డ్‌కు మధ్య ఉన్న సంబంధాలు బయటపడ్డాయి.
గత కొంతకాలంగా అండర్ వరల్డ్, దోపిడీ కార్యకలాపాలలో తమ ప్రాబల్యం క్రమంగా క్షీణిస్తున్న నేపథ్యంలో మనుగడ కోసం డి-కంపెనీ చేస్తున్న తీవ్ర ప్రయత్నమే ఈ ఆకస్మిక చర్యలకు కారణమని ఏజెన్సీలు కూడా అనుమానిస్తున్నాయి. తమ గ్యాంగ్ ఇమేజ్‌ను పునరుద్ధరించుకోవడానికి ఐఎస్‌ఐ సహాయంతో భారత్‌లో ఒక పెద్ద దాడికి పాల్పడటం లేదా ఒక శక్తివంతమైన ప్రముఖుడిని టార్గెట్ చేయడం దావూద్ గ్యాంగ్ ప్రణాళికగా ఉందని వర్గాలు తెలిపాయి.
ఇలాంటి ఉగ్ర కుట్రలకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్ పాత్ర ఎప్పుడూ ఒకేలా ఉన్నప్పటికీ భారత భద్రత బలగాలు, దర్యాప్తు సంస్థలు సరైన సమయంలో కీలక అరెస్టులు చేస్తూ వారి వ్యూహాలను నిరంతరం తిప్పికొడుతున్నాయి.

More Stories
మయన్మార్ భూభాగాన్ని భారత్ కు వ్యతిరేకంగా అనుమతించం!
సంక్షోభంలో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం?
సంతకాల ఫోర్జరీపై ఫిర్యాదు చేసిన టీఎంసీ ఎమ్మెల్యేలు సస్పెండ్