నీట్ పేపర్ లీకేజీలో జవాబుదారీతనం తప్పనిసరి

* యూపీఎస్‌సీని చూసి నేర్చుకోండి.. సుప్రీంకోర్టు 
 
నీట్ పేపర్ లీక్ వివాదంలో జవాబుదారీతనం నిర్ధారించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం నొక్కి చెప్పింది. ఈ పరిస్థితి విద్యార్థులకు మాత్రమే కాకుండా వారి కుటుంబాలకు కూడా “నిజంగా చాలా బాధాకరమైనది” అని కోర్టు పేర్కొంది.  ఈ అంశానికి సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం, పరీక్షా వ్యవస్థలోని వైఫల్యాల వల్ల యువ ఆశావహులు నిరాశ చెందకూడదని వ్యాఖ్యానించింది. 
 
“మనం మన యువతను నిరాశపరచకూడదు,” అని విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.  దేశంలో అత్యంత కష్టమైన సివిల్స్ పరీక్షలు నిర్వహించే యూపీఎస్‌సీకి సంబంధించిన పేపర్లు ఒక్కసారి కూడా లీక్ కాలేదని, ఈ విషయంలో యూపీఎస్‌సీని చూసి నేర్చుకోవాలని ఎన్‌టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)కి సుప్రీంకోర్టు సూచించింది. నీట్ యూజీ పేపర్ లీకేజీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక దశల్లో తనిఖీలు, భద్రతా ప్రమాణాలు ఉన్నప్పటికీ నీట్ పేపర్ ఎలా లీకైందని కోర్టు ఎన్‌టీయేను ప్రశ్నించింది.

“ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల ఆధారంగా మీరు పర్యవేక్షించినా ఈ ఘటన జరిగిందంటే అసలు సిఫార్సులోనే లోపం ఉంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని మీరు ఊహించలేదు. రెండోది, సమర్థమంతమైన పర్యవేక్షణ జరిగి ఉండదు. ఇది ఎలా జరిగింది?” అని కమిటీకి నేతృత్వం వహించిన రాధాకృష్ణన్ను జస్టిస్ నరసింహ ప్రశ్నించారు. 

దీనికి బదులిచ్చిన రాధాకృష్ణన్, నీట్ పరీక్షలో తలెత్తిన సమస్యల నేపథ్యంలో 2024 జూన్‌లో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, వారు 101 సిఫార్సులు ఇచ్చారని తెలిపారు. స్వల్పకాలికంగా (2025, 2026 పరీక్షల కోసం) 60 సిఫార్సులు చేయగా, వాటిలో చాలా వరకు అమలు చేశామన్నారు. దీర్ఘకాలికంగా 35 సిఫార్సులు చేశామని వాటిలో చాలా వరకు ప్రారంభించామని ధర్మాసనానికి తెలిపారు.

ఈ అంశంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పరీక్షలను ఎలా నిర్వహించాలి? ఎన్‌టీఏలో నిపుణులను చేర్చడం ద్వారా మానవ వనరులను ఎలా మెరుగుపరచాలి? అనే అంశాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదులుగా, విద్యా శాఖ ముందుగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. 

2024, 2026 పరీక్షలో జరిగినటువంటి ఘటన మళ్లీ జరగకుండా చూసేందుకు ఎన్‌టీఏకు భౌతికంగా, మేధోపరంగా అవసరమైన వనరులు ఉండేలా చూడటమే తమ ప్రయత్నమని వ్యాఖ్యానించింది. కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని న్యాయస్థానానికి తెలిపారు.

ఈ ప్రక్రియలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా చూసేందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. “నిజమైన జవాబుదారీతనం ఏర్పడేంత వరకు, అసలైన సమస్యకు పరిష్కారం లభించదు,” అని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. జూన్ 21న జరగనున్న నీట్-యుజి పునఃపరీక్ష కోసం అదనపు రక్షణ చర్యలు మరియు యంత్రాంగాలను ప్రవేశపెట్టినట్లు మెహతా న్యాయస్థానానికి తెలియజేశారు.