ప్రాంతీయ పార్టీలలో టిడిపికే అత్యధికంగా ఆదాయం 

ప్రాంతీయ పార్టీలలో టిడిపికే అత్యధికంగా ఆదాయం 

2024-25 ఆర్థిక సంవత్సరంలో 36 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 51.57 శాతం తగ్గింది. అంతేకాకుండా ఇందులోని 21 పార్టీలు తాము ప్రకటించిన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశాయి. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికను విడుదల చేసింది.  ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 67 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల్లోని 36 పార్టీల వార్షిక ఆడిట్ ఖాతాలను ఏడీఆర్ విశ్లేషించింది. 

2024-25లో అధిక ఆదాయం పొందిన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం రూ. 228.31 కోట్లతో నిలిచింది. ప్రాంతీయ పార్టీల పొందిన మొత్తం ఆదాయంలో ఇది 19.14 శాతం. టిడిపి తర్వాతి స్థానాల్లో టీఎంసీ రూ. 219.35 కోట్లు, వైసీపీ రూ. 140.39 కోట్ల ఆదాయం పొందాయి. ఖర్చుల పరంగా చూస్తే వైసీపీ అత్యధికంగా రూ. 340.20 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో బీజేడీ రూ. 288.44 కోట్లు, టీఎంసీ రూ. 227.59 కోట్లు ఖర్చు చేశాయి. 

మొత్తం 36 పార్టీల్లో 21 పార్టీలు తాము ఆర్జించిన ఆదాయం కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేశాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. 36 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ. 1,192.94 కోట్లుగా నమోదైంది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరం ఆదాయంతో (రూ.రూ. 2,463.17 కోట్లు) పోలిస్తే రూ. 1,270.23 కోట్లు (51.57 శాతం) తక్కువ. 

అయితే, ఈ పార్టీలు ప్రకటించిన మొత్తం ఖర్చు రూ. 1,433.07 కోట్లకు చేరింది. ఇది వాటి మొత్తం ఆదాయం కంటే రూ. 240.12 కోట్లు లేదా సుమారు 20 శాతం అధికం కావడం గమనార్హం. మొత్తం ఆదాయంలో దాదాపు 69 శాతం వాటా, మొత్తం వ్యయంలో 77 శాతానికి పైగా వాటా కేవలం మొదటి ఐదు పార్టీలదే.

అదే సమయంలో 15 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయకుండా ఆదా చేశాయి. అత్యధికంగా డబ్బులు ఆదా చేసిన పార్టీగా టీడీపీ నిలిచింది. ఆ పార్టీ రూ. 166.98 కోట్లను ఖర్చు చేయకుండా పొదుపు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన రూ. 36.27 కోట్లు, అన్నాడీఎంకే రూ. 35.86 కోట్లతో నిలిచాయి.

అన్ని పార్టీలకు కలిపి విరాళాలు, చందాల ద్వారా రూ. 702.36 కోట్లు సమకూరాయి. అత్యధిక విరాళాలను పొందిన ప్రాంతీయ పార్టీగా టీఎంసీ (రూ. 184.08 కోట్లు) నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వైసీపీ (రూ. 140.05 కోట్లు), టీడీపీ (రూ. 85.20 కోట్లు) నిలిచాయి.  15 ప్రాంతీయ పార్టీలు తమ మొత్తం వ్యయంలో 55 శాతానికి పైగా ఎన్నికల ప్రచారం కోసమే ఖర్చు చేశాయి. అత్యధికంగా వైసీపీ రూ. 299.92 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాతి బీజేడీ (రూ. 270.66 కోట్లు), బీఆర్ఎస్ (రూ.147.99 కోట్ల) నిలిచాయి.