గెంటివేయకముందే అక్రమ వలసదారులు పారిపోండి 

గెంటివేయకముందే అక్రమ వలసదారులు పారిపోండి 
ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన విధంగానే బెంగాల్‌లోని బంగ్లాదేశీ అక్రమ వలసదారులపై సువేందు అధికారి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమంగా భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశీయులను తమ స్వదేశానికి పంపేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సువేందు చొరబాటుదారులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. 
 
బెంగాల్‌ నుంచి వెళ్లగొట్టకముందే పారిపోవాలని సూచించారు. బంగ్లా ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
ప్రస్తుతం ఉన్న విదేశీయుల చట్టానికి లోబడే తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు బెంగాల్‌ సీఎం స్పష్టం చేశారు.  భారత్‌ నుంచి తమ పౌరులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ ఇప్పటికే చెప్పిందని గుర్తు చేస్తూ వారిని తిరిగి తీసుకువెళ్లడం అక్కడి ప్రభుత్వ బాధ్యత అని సువేందు పేర్కొన్నారు.
చొరబాటుదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జైల్లో పెట్టొద్దని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. వారికి ఆశ్రయమిచ్చి, తిండి పెట్టడానికి వారేమైనా మన బంధువులా? అని ప్రశ్నించారు. బెంగాల్ ప్రభుత్వం ‘గుర్తించండి, తొలగించండి, బహిష్కరించండి’ అనే నినాదంతో విదేశీయులను దేశం నుంచి పంపేయడానికి చర్యలు తీసుకుంటోంది.
ఈ క్రమంలోనే అక్రమంగా రాష్ట్రంలోకి చొరబడినట్లు గుర్తించిన వారికి, సరైన పత్రాలు లేని వారికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించడానికి నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది.   దేశ బహిష్కరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశిస్తూ, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అటువంటి వ్యక్తులను నిర్బంధంలో ఉంచే లేదా వారి పోషణ కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేసే ఉద్దేశం లేదని అధికారి తెలిపారు.
ఈ ప్రధాన సమస్య స్థానిక వనరులతో పాటు రాష్ట్ర పౌరులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు. మాల్దాలో తొలి నిర్బంధ కేంద్రాన్ని ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, అక్రమంగా రాష్ట్రంలోకి వలస వచ్చిన వారిపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేయడంతో బంగ్లాదేశీయులు తమ స్వదేశానికి పయనమవుతున్నారు. 

మంగళవారం ఉదయం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపుర్ సరిహద్దు ప్రాంతంలో పదుల సంఖ్యలో బంగ్లాదేశీయులు గుమిగూడినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ‘సర్‌’ ప్రక్రియ చేపట్టిన సమయంలో కూడా ఈ సరిహద్దు నుంచి వందల సంఖ్యలో బంగ్లాదేశీయులు తమ దేశానికి వెళ్లినట్లు తెలిపారు.