కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని తాను కోరినట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారిగా స్పందిస్తూ తాను ఏపీ అభివృద్ధి కోసమే హోంమంత్రిని కలిసినట్లు రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తల సమైవేశంలో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
“వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను? ఒకరు జైలుకు వెళ్తేనే పవన్ కల్యాణ్ జనసేన ఎదుగుతుందా..? హోంమంత్రితో ఇలాంటి విషయాలే మాట్లాడతామా?” అని ప్రశ్నించారు. అటువంటి ఆరోపణలు చేయడం వ్యవస్థను అవమానపరచడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటి వాళ్లకు ఎలా తెలుస్తాయి? ఈ అంశంపై ఏపీ బీజేపీ నేతలుఎందుకు స్పందిచలేదు? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
జగన్‌ను జైలుకు పంపాలని తాను కోరినట్లు కొందరు చెప్పడంలో లాజిక్ ఏంటో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ‘‘ఆ విశ్లేషకుడి ప్రకారం జగన్ జైలుకు వెళ్తే నాకు లాభం చేకూరుతుందనడం పిచ్చి లాజిక్. ఒకవేళ అదే లాజిక్ ప్రకారం చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు నేను ప్రయత్నిస్తే సీఎం అయ్యేవాడిని కదా? నేను శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతా బలహీనంగా ఉన్నప్పుడు కొట్టను’’ అని తేల్చిచెప్పారు.
“ఇప్పటివరకు అన్నీ భరించాను. ఇకపై భరించే ఓపిక నాకు లేదు. దారిన పోయే వాళ్ల్లంతా జనసేనపై రాళ్లు వేస్తామంటే ఊరుకొను” అని ఆయన హెచ్చరించారు. “మాకు కోపాలు, బాధలు ఉంటాయి. చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దు. దేనికైనా ఓహద్దు ఉంటుంది.. రెచ్చగొట్టడం సరికాదు” అని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కుల ప్రస్తావన తీసుకు రావడం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “విశ్లేషించే వారిని ప్రశ్నిస్తే కులం కార్డును పట్టుకొస్తామంటే ఎలా కుదురుతుంది? ఇష్టానుసారం మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవాలా? మాకు కోపం రాదా? అందరికీ అన్నిసార్లు భయపడతానని అనుకుంటున్నారా?” అని నిలదీశారు.
కాగా, స్థానిక ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘‘ఎక్కడ గెలవగలమో పరిశీలించాలి. కచ్చితంగా గెలవగలమనే స్థానాలపై కమిటీ ఏర్పాటు చేద్దాం. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం చాలా అవసరం. 25 పార్లమెంటు స్థానాలకు కమిటీలను పంపిస్తున్నా. వచ్చే నెల మొదటి వారంలో కమిటీలు ప్రారంభిస్తా. ఆగస్టు 14 నాటికి పూర్తి కావాలి’’ అని స్పష్టం చేశారు.

More Stories
బిజెపి `జనతా వారధి’లో కల్తీ ఆహారం, ఆహార భద్రతపై ఆందోళన
రాయచోటి `రహస్య జీవనం’లో హిందూ ప్రముఖుల హత్యకు ఆలీ కుట్ర!
లిక్కర్ స్కామ్ లో వైసిపి మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్