10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 4 స్థానాలతో పాటు గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో జూన్ 18న పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు ఓట్లు లెక్కిస్తారు. జూన్‌1న నోటిఫికేషన్‌ విడుదల కానుంది.  నామినేషన్ల దాఖలకు జూన్ 8 చివరి తేదీ కాగా జూన్‌ 9న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 

జూన్‌ 18న ఎన్నికలు నిర్వహించచి, అదే రోజు సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో సభ్యుల పదవీకాలం వచ్చే రెండు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టనుంది.  ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో మూడేసి స్థానాలు, ఝార్ఖండ్‌లో రెండు స్థానాలు ఉన్నాయి.

అలాగే మణిపుర్‌, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీశ్​ పదవీ కాలం జూన్‌ 26న ముగియనుంది. దీంతో ఏపీలోని నాలుగు స్థానాలకు జూన్‌ 18న ఎన్నికలు జరగనున్నాయి. 

ఇక మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పదవీకాలం ముగియనుంది. కర్ణాటకలో మాజీ ప్రధాని హెచ్​డీ దేవేగౌడ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో ఈ ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదే సమయంలో మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన రెండు రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్రలో ఎన్​సీపీ జాతీయ అధ్యక్షురాలు, ఉపముఖ్యమంత్రి సునేత్రా అజిత్‌ పవార్‌ రాజీనామా చేయడంతో ఒక స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఆమె మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

తమిళనాడులో అన్నాడీఎంకే నేత సీవీ షణ్ముగం రాజీనామాతో మరో స్థానం ఖాళీ అయింది. షణ్ముగం రాజ్యసభ పదవీకాలం కూడా 2028 జూన్‌ 29 వరకు కొనసాగాల్సి ఉండగా, మైలాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయన రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు కూడా జూన్‌ 18నే పోలింగ్‌ నిర్వహించనున్నారు.