* గోవు బలి ఈద్‌లో భాగం కాదు.. హైకోర్టు స్పష్టం
ఇకపై పాఠశాలలతోపాటు రాష్ట్రంలో నడిచే మద్రాసాలలో కూడా వందేమాతరం చదవడాన్ని పశ్చిమ బెంగాల్ లో నూతన ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన మద్రాసాలలో వందేమాతరాన్ని ఉదయం తప్పనిసరిగా ఆలపించాల్సిందే అంటూ రాష్ట్ర విద్యాశాఖ తరఫున డైరెక్టరేట్ ఆఫ్ మద్రాసా ఆధ్వర్యంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
పశ్చిమ బెంగాల్‌లో అనేక మద్రాసాలు మైనారిటీ వ్యవహారాల శాఖ, మద్రాసా విద్యా విభాగం ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన వాటిల్లోనే కాకుండా, ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ మద్రాసాలలో తరగతులు ప్రారంభించే ముందు ఇకపై వందేమాతరం చదవాలి. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రెండు వారాల వ్యవధిలోనే బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
వందేమాతరం ఆలపించడానికి సంబంధించి గతవారమే ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ పరిధిలోకి వచ్చే ప్రతి పాఠశాలలో ఆరు భాగాల వందేమాతరాన్ని తప్పనిసరిగా ఆలపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం తరగతులు ప్రారంభమయ్యే ముందు విద్యార్థులు తప్పనిసరిగా వందేమాతరం ఆలపించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
వందేమాతరం చుట్టూ ఇటీవల కొంత వివాదం జరుగుతోంది. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరాన్ని తప్పనిసరిగా ఆలపించాలని కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీయే ప్రభుత్వం ఆదేశించింది. వందేమాతర గీతం దేశంలో రాజకీయంగా, సాంస్కృతికంగా గుర్తుగా నిలిచిందని కేంద్రం పేర్కొంది. జాతీయ గేయంతో సమానంగా జాతీయ గీతాన్ని కూడా గౌరవించాలని కేంద్రం పేర్కొంది.
మరోవంక, వచ్చే వారం జరిగే ఈద్ అల్-అధాను పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎద్దులు, ఆవులు, దూడలు, గేదెల వధపై పరిమితులు విధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కలకత్తా హైకోర్టు గురువారం తిరస్కరించింది. గోవు బలి అనేది ఇస్లాంలో ఒక ఆవశ్యకత మత ఆచారం కాదని స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.నిజానికి మే13న ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ 2018లో కోర్టు స్వయంగా ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడమేనని చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ పార్థ సారథి సేన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అందువల్ల ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించాల్సిన, పక్కన పెట్టాల్సిన పరిస్థితి తమకు కన్పించడం లేదని పేర్కొంటూ, దానిపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.
కాగా, వచ్చే వారం జరిగే బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో విచ్చలవిడిగా పశువధ జరగకుండా నిరోధించేందుకు ప్రభుత్వం జంతుబలి చట్టం కింద ఈ నెల 13న దానిపై పరిమితులు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం అన్‌ఫిట్ అన్న ధ్రువీకరణ పత్రం లేని ఏ జంతువును కూడా వధించ రాదు.

More Stories
సందేశ్‌ఖాలిలో కిరాతకంపై తిరగబడ్డ రేఖా పాత్ర
జనసేన ఫిర్యాదుతో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు
మోదీని పాములవాడిగా చూపిన నార్వే జాత్యహంకార కార్టూన్!