తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇప్పటిదాకా ఒకటిగా ఉన్న గోదావరి- కావేరీ అనుసంధాన ప్రాజెక్టును రెండు భాగాలుగా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందులో ఒక భాగం సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ దాకా కాగా, రెండోది పోలవరం నుంచి చేపట్టేది.
ఈ ప్రక్రియలో భాగంగా రెండు కీలక అడుగులు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకటి, 88 టీఎంసీలతో తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏపీ అంగీకారం తెలపాలి. దానికి బదులుగా 167 టీఎంసీలతో పోలవరం నుంచి గోదావరి- కావేరీ అనుసంధానానికి తెలంగాణ సమ్మతి తెలియజేయాలని కేంద్రం షరతు పెట్టింది.
ఇందుకు రెండు రాష్ట్రాలూ సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇవి కార్యరూపం దాల్చితే తెలుగు రాష్ట్రాలకు జల వివాదాల విషయంలో శాశ్వతంగా మేలు జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్రస్తుతం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) వద్ద పెండింగ్‌లో ఉంది.
90 టీఎంసీలతో డీపీఆర్ సమర్పించగా, నీటి కేటాయింపులపై సీడబ్ల్యూసీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ 90 టీఎంసీల్లో 45 టీఎంసీలు పోలవరం నుంచి వచ్చే వాటా కాగా, మరో 45 టీఎంసీలు తెలంగాణలో మైనర్ ఇరిగేషన్‌లో చేసిన పొదుపు ఖాతాలోనివి. ఈ పథకానికి అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ఇటీవలే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి జలవివాదాల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణ విజ్ఞప్తితోనే పాలమూరు- రంగారెడ్డికి ఆమోదం తెలుపాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఆర్ పాటిల్ ప్రత్యేకంగా కోరారు.
పాలమూరుకు ఆమోదం తెలుపడానికి చంద్రబాబు అంగీకారం వ్యక్తం చేశారని అదే సమయంలో పోలవరం నుంచి గోదావరి-కావేరీ అనుసంధానానికి తెలంగాణ సమ్మతి తెలిపేలా చూడాలని ఆయన కోరారని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు అనుమతి లభిస్తే కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీలు వాడుకోవాలని బచావత్ ట్రైబ్యునల్ తీర్పు ఉంది.

More Stories
వరంగల్ జంట హత్యల కేసులో మరణ శిక్ష
హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం 50 శాతం, మూసీకి రూ. 3,975 కోట్లు
జలమండలి జీఎం అక్రమాస్తులు వంద కోట్లపైనే!