ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను, మాయమాటలతో తనకు కాకుండా చేస్తున్నారన్న పగతో, భార్య తల్లిదండ్రులను నరికి చంపిన నేరస్తునికి మరణశిక్ష విధిస్తూ వరంగల్ జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి జె.మైత్రేయి బుధవారం సంచలన తీర్పు వెలువరించారు.
మృతుడు బానోత్ శ్రీను తల్లి బానోతు వీరమ్మ ఫిర్యాదు ప్రకారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాకు చెందిన తన మనవరాలు దీపిక హనుమకొండలోని పింగళి కళాశాలలో చదువుకునేది. ఈ క్రమంలో తమ సమీప గ్రామమైన గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు.
ఆటో నడుపుకునే నిందితుని మాటలు నమ్మిన దీపిక ఆ తర్వాత ఎవరికి తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిసింది. కొద్ది రోజుల్లోనే నాగరాజు ప్రవర్తన నచ్చక దీపిక తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుని అక్కడే స్థిరపడిపోయింది. అప్పటినుండి దీపికపై , ఆమె కుటుంబ సభ్యులపై పగ పెంచుకొని తనకు తన భార్యను దూరం చేసిన దీపిక తల్లిదండ్రులను, దీపికను, ఇతర కుటుంబ సభ్యులను ఎప్పటికైనా చంపేస్తానని అప్పుడప్పుడు తమ తండాకు వచ్చి నిందితుడు నాగరాజు బెదిరించేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నది.
అందులో భాగంగా 10 – 07- 2024 రోజు అర్ధరాత్రి పొడవాటి కత్తితో మోటార్ సైకిల్ పై తమ తండాకు చేరుకున్న నాగరాజు ఇంటి ముందు పడుకున్న దీపికను, ఆమె తండ్రి శ్రీను,తల్లి సుగుణ, సోదరుడు మదన్ లపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో దీపిక తల్లి అక్కడికక్కడే చనిపోగా ఆసుపత్రికి వెళ్లే మార్గమధ్యంలో దీపిక తండ్రి శ్రీను మృతి చెందాడు.
తీవ్ర గాయాలైన దీపిక, మదన్ లను తండావాసులు ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించడంతో వారిరువురూ ప్రాణాలు నిలుపుకున్నారు. ఈ స్వైర విహారంలో నిందితుడు నాగరాజు అడ్డు వచ్చిన తండావాసులను బెదిరిస్తూ పారిపోయి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడడం కోసం చేయి కోసుకొని ఆ తర్వాత తన భార్య దీపిక మరణించలేదని విషయం గుర్తుకొచ్చి అక్కడ నుండి పారిపోయి కుటుంబ బంధువుల ఇళ్లలో తలదాచుకోగా పోలీసులకు పట్టుబడ్డాడు అని కేసు దర్యాప్తు ద్వారా తెలిసింది.
సాక్ష్యాదారాలు, వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి జె.మైత్రేయి నిందితుడు మేకల నాగరాజు నేరపూరిత హత్యాకాండ అత్యంత పాశవికమైనదని, ఇటువంటి నిందితులకు జీవించే హక్కు లేదని, నిందితున్ని మరణించే వరకు మెడకు ఉరివేసి శిక్షణ అమలు పరచాలని తమ తీర్పులో పేర్కొన్నారు.

More Stories
తెలుగు రాష్ట్రాల జలవివాదాలు పరిష్కారంకు కేంద్రం ఫార్ములా!
హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం 50 శాతం, మూసీకి రూ. 3,975 కోట్లు
జలమండలి జీఎం అక్రమాస్తులు వంద కోట్లపైనే!