అంతర్జాతీయ వేదికలపై భారత సంతతి వ్యక్తులు తమ ప్రతిభతో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తూనే ఉన్నారు. తాజాగా బ్రిటన్ మేయర్‌గా మన దేశానికి చెందిన ఓ 23 ఏళ్ల యువకుడు ఎన్నికై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. తూర్పు ఇంగ్లండ్‌లోని ప్రతిష్ఠాత్మక ‘ఎల్స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్’ టౌన్ కౌన్సిల్‌కు ఆయన నూతన మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
మే 13వ తేదీన బోర్హామ్వుడ్లోని ఫెయిర్వే హాల్లో అత్యంత వైభవంగా జరిగిన ‘మేయర్ మేకింగ్ సెర్మనీ’ అధికారిక కార్యక్రమంలో ఈ నియామకాన్ని ఖరారు చేశారు. యూకే చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో మేయర్‌గా ఎన్నికైన ఇతడి పేరు తుషార్ కుమార్. బ్రిటన్‌లోని ప్రముఖ అధికార పక్షమైన ‘లేబర్ పార్టీ’ సభ్యుడిగా ఉన్న తుషార్ కుమార్‌కు రాజకీయాలంటే చిన్నప్పటి నుంచే మక్కువ ఎక్కువ. అందుకనే ఆయన లండన్‌లోని ప్రఖ్యాత ‘కింగ్స్ కాలేజ్’ నుంచి పొలిటికల్ సైన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు.
చదువుకునే రోజుల్లోనే స్థానిక పౌర, సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఈ క్రమంలోనే 2023లో ఆయన మొదటి సారిగా ఎల్స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేరారు. అక్కడ తన పని తీరుతో అందరినీ ఆకట్టుకుని మేయర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు డిప్యూటీ మేయర్‌గా కూడా విజయవంతంగా సేవలు అందించారు. తుషార్ కుమార్‌కు కేవలం రాజకీయాల్లోనే కాకుండా పాలనాపరమైన ఇతర రంగాలలోనూ మంచి అనుభవం ఉంది.
బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన ‘డిపార్ట్మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్’ (డీడబ్ల్యూపీ) సంస్థకు ఆయన సలహాదారుగా వ్యవహరించారు. అలాగే ఎల్జీబీటీక్యూ ప్లస్ (ఎల్జీబీటీక్యూ ప్లస్) హక్కుల కోసం పని చేసే ఒక ప్రముఖ సామాజిక సంస్థలో రీసెర్చ్ అనలిస్ట్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ఈ అరుదైన గౌరవం దక్కడంపై తుషార్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ ఇది తనకు దక్కిన అద్భుతమైన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
“లండన్ కింగ్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదవడం నుంచి, ఈ రోజు నేను ఎంతో ప్రేమించే నగరానికి మేయర్‌గా సేవ చేసే స్థాయికి రావడం నిజంగా ఒక కలలా అనిపిస్తోంది. ఇంత చిన్న వయసులోనే నన్ను నమ్మి ఈ బాధ్యతను అప్పగించి, నా రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తుషార్ భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా తనకు డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడు ఎన్నో సలహాలు సూచనలు చేసిన మాజీ మేయర్ కౌన్సిలర్ డాన్ ఓజారోకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మేయర్‌గా తన పదవీ కాలంలో నగర ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, స్థానిక స్వచ్ఛంద సంస్థలకు, కమ్యూనిటీ గ్రూపులకు పూర్తి ప్రోత్సాహం అందిస్తానని తుషార్ కుమార్ చెప్పారు. తన విజయం మరింత మంది యువతీ యువకులను రాజకీయాల్లోకి వచ్చేలా.. ప్రజా సేవలో భాగస్వామ్యమయ్యేలా స్ఫూర్తిని నింపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

More Stories
భారతదేశం ఇప్పుడు నక్సల్ రహిత దేశం
ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్- నార్వే నిబద్ధత!
కేబీర్ పార్క్ చుట్టూరా చెట్ల నరికివేతపై సుప్రీం ఆంక్షలు!