భారతదేశం ఇప్పుడు నక్సల్ రహిత దేశం

భారతదేశం ఇప్పుడు నక్సల్ రహిత దేశం
* నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం
“భారతదేశం ఇప్పుడు నక్సల్ రహిత దేశం అని నేను గర్వంగా ప్రకటిస్తున్నాను,” అని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి, నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో సోమవారం తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టుల నిర్మూలనకు కృషి చేసిన పోలీస్ అధికారులను సన్మానించారు. 
 
“ఈ రోజు బస్తర్‌కు చాలా గొప్ప రోజు. ఆజ్ యహా ఖడా రెహ్కర్ సీనా తన్ కే కెహ్ సక్తా హూ భారత్ నక్సల్ ముఖ్త్ హో చుకా హై. (ఈ రోజు ఇక్కడ నిలబడి, భారతదేశం నక్సలిజం నుండి విముక్తి పొందిందని నేను గర్వంగా చెప్పగలను). ఈ ఘనత అంతా మన భద్రతా దళాలకే దక్కుతుంది. నేను మీకు నమస్కరిస్తున్నాను. ఇది ఒక కల — ఈ కలను నిజం చేయడానికి వేలాది మంది జవాన్లు తమ ప్రాణాలను అర్పించారు” అని కొనియాడారు. 
తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజాన్ని సమూలంగా అణచివేసి, రాష్ట్రాన్ని నక్సల్స్ రహితంగా తీర్చిదిద్దడంలో ప్రతిభ కనబరిచిన తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులను హోం మంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్, రాష్ట్ర భద్రతా సలహాదారు, మాజీ డీజీపీ బి.శివధర్ రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ (ఆక్టోపస్ & గ్రేహౌండ్స్) అనిల్ కుమార్, మల్కాజ్‌గిరి కమిషనర్ & మాజీ ఎస్‌ఐబీ ఐజీపీ సుమతిలతో పాటు ఆమె నేతృత్వంలోని ఎస్‌ఐబీ బృందాన్ని అమిత్ షా సత్కరించి, వారి విశేష సేవలను అభినందించారు. 
 
2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పుడు, భారతదేశం జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలలో భద్రతా సమస్యలను, అలాగే వామపక్ష తీవ్రవాద భూతాన్ని ఎదుర్కొందని అమిత్ షా గుర్తు చేశారు. “నేడు, స్థూలంగా చెప్పాలంటే, భారతదేశం ఈ మూడు సమస్యల నుండి విముక్తి పొంది, అభివృద్ధి పథంలో పయనిస్తోంది,” అని తెలిపారు.  2024 జనవరిలో ఒక అంతర్గత సమావేశంలో 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని తాము కాలపరిమితిని నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
మావోయిస్టులు పూర్తిగా నిర్మూలిస్తామని తాము నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది ప్రైవేట్ చర్చల్లో ఇది సాధ్యం కాదంటూ సందేహాలు వ్యక్తం చేశారని తెలిపారు. కానీ తాము  స్పష్టమైన ప్రణాళికతో, పక్కా వ్యూహంతో ముందుకు సాగామని చెప్పారు.  ఛత్తీస్‌గఢ్ ఇప్పుడు నక్సలిజం మహమ్మారి నుంచి విముక్తి పొందిందని, వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ పోరాటంలో ఇదొక చరిత్రాత్మక మైలురాయి అని ఆయన కొనియాడారు.
రాబోయే ఐదేళ్లలో బస్తర్‌ను భారతదేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన కొత్త లక్ష్యమని హోం మంత్రి ప్రకటించారు. 70 కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సిఎపిఎఫ్ ) శిబిరాలు అన్ని అభివృద్ధి కార్యకలాపాలకు ఏకైక కేంద్రాలుగా పనిచేస్తాయని, సుమారు 370 ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలను అందిస్తాయని ఆయన వెల్లడించారు. 

1970వ దశకం నుంచి 2026 మార్చి 31వరకు దాదాపు మూడు తరాల పాటు దేశ ప్రజలు నక్సలిజం అనే ఒక పీడకలను చవిచూశారని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర రక్తపాతం, అభివృద్ధి నిలిచిపోవడం, యువత భవిష్యత్తు అంధకారమవ్వడం వంటి పరిస్థితులు ఉండేవని ఆయన గుర్తుచేశారు. నక్సలిజం నిర్మూలన పోరాటంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన జవాన్లు ప్రాణ త్యాగం చేశారని, వారి బలిదానాల వల్లే నేడు ఈ విజయం సాధ్యమైందని హోం మంత్రి కొనియాడారు.

నక్సలిజం కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదని, తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా దీనిపై ఆందోళన ఉండేదని షా తెలిపారు. ఒక జీవిత కాలంలో సాధించలేమనుకున్న అసాధ్యమైన లక్ష్యాన్ని భద్రతా దళాల సమన్వయం, పట్టుదలతో సాకారం చేశామని అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, భద్రతా దళాల ప్రతినిధులు పాల్గొన్నారు.