యూపీలో ఇకపై రోడ్లపై నమాజ్ చేస్తే చర్యలు

యూపీలో ఇకపై రోడ్లపై నమాజ్ చేస్తే చర్యలు
చట్టం అందరికీ సమానమని పేర్కొంటూ ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయకుండా ఉండాలని, ఆ విధంగా చేస్తే చర్యలు తప్పవని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. రోడ్లు సామాన్య పౌరులు, వ్యాపారవేత్తల రాకపోకలని, వాటిని ఎవరూ అడ్డుకోవడానికి తమ ప్రభుత్వం అనుమతించదని ఆయన హెచ్చరించారు. 
లక్నోలో జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించిన వీడియోను తన ఎక్స్  ఖాతాలో పంచుకుంటూ, అవసరమైతే షిఫ్టుల వారీగా ఏర్పాట్లు చేయవచ్చని, కానీ ప్రజలకు అసౌకర్యం కలిగించడాన్ని అనుమతించలేమని ముఖ్యమంత్రి చెప్పారు.
పైగా, ముస్లింలు తమ జనాభాను నియంత్రించుకోవాలని కూడా ఆయన హితవు చెప్పారు.  “ఉత్తర ప్రదేశ్‌లో ప్రజలు నిజంగా రోడ్లపై నమాజ్ చేయరా? అని నన్ను తరచుగా అడుగుతుంటారు. నేను స్పష్టంగా చెప్పేదేమిటంటే, అలా అస్సలు జరగదు. మీరే వెళ్లి చూడండి. రోడ్లు రాకపోకల కోసమే. ఎవరైనా వచ్చి కూడలి వద్ద హంగామా సృష్టించి, ట్రాఫిక్‌ను అడ్డుకోవచ్చా? ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించే హక్కు ఎవరికింది?” అని ఆదిత్యనాథ్ ప్రశ్నించారు.
 
“కొంతమంతి అడుగుతుంటారు. తాము ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా నమాజ్ చేయకుండా ఉండటం సాధ్యం కాదు కదా అని. మీ ఇంట్లో అంత స్థలం లేకపోతే దానికి అనుగుణంగా జనాభా తగ్గించుకోండి. అనవసరంగా జనాభా పెరగడాన్ని తగ్గించుకోవాలి. ప్రభుత్వ నిబంధన అంటే అది చట్టమే. అది అందరికీ సమానంగా వర్తిస్తుంది. నమాజ్ తప్పనిసరి. కానీ, మీ షిఫ్టుకు అనుగుణంగా చేసుకోండి. మేం ఆపం. కానీ, రోడ్లపై నమాజ్ చేయొద్దు” అంటూ యోగి స్పష్టం చేశారు. 
 
ఆ వీడియోలో, చట్టం అందరికీ సమానమేనని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రజా మౌలిక సదుపాయాలను ఎవరూ దుర్వినియోగం చేయడానికి అనుమతించబోమని ఆయన పునరుద్ఘాటించారు. “ప్రభుత్వ పాలన అంటే చట్టబద్ధమైన పాలన. అది అందరికీ సమానంగా వర్తిస్తుంది. నమాజ్ అవసరం–మీరు మీ షిఫ్ట్ సమయంలో దాన్ని చదవవచ్చు. మేము దానిని ఆపము, కానీ రోడ్డుపై మాత్రం కాదు,” అని ఆయన పేర్కొన్నారు.
 
ఉత్తరప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన యోగి ఆదిత్యనాథ్, గతంలో కూడా ఇలాంటి పిలుపులనే ఇచ్చారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నప్పుడు, ఆయన ఇలాంటి ప్రకటననే చేసి, ప్రజలను వీధుల్లో నమాజ్ చేయడానికి అనుమతిస్తున్నందుకు మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై విమర్శలు చేశారు.