జస్టిస్ మనోజ్ జైన్ కు ఢిల్లీ మద్యం కేసు

జస్టిస్ మనోజ్ జైన్ కు ఢిల్లీ మద్యం కేసు

ఢిల్లీ లిక్కర్ కేసును ఇకపై జస్టిస్ మనోజ్ జైన్ విచారించనున్నారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలైన మనీష్ సిసోడియా వంటి నేతలు కీలక నిందితులుగా ఉన్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా పలువురు నిందితులపై సీబీఐ మోపిన అభియోగాల్ని ఇటీవల ట్రయల్ కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో కేజ్రీవాల్ సహా నిందితులంతా బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఈ విచారణ మంగళవారం జరగనుంది. దీన్ని జస్టిస్ మనోజ్ జైన్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారించనుంది.

ఇంతకుముందు ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆధ్వర్యంలోని బెంచ్ విచారించింది. అయితే, ఆమె ఈ కేసు వాదించడాన్ని కేజ్రీవాల్ సహా నిందితులు వ్యతిరేకించారు. జస్టిస్ స్వర్ణకాంత శర్మపై పలు ఆరోపణలు చేశారు. ఆమెకు ఆర్ఎస్‌ఎస్ వంటి సంస్థలతో సంబంధాలున్నాయని, కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగదని తెలిపారు. అందుకే, ఆమె ఉంటే కేసు విచారణకు హాజరు కాబోమని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ఈ కేసుతో ముడిపడి ఉన్న అంశాల నుండి ఉత్పన్నమైన క్రిమినల్ కోర్టు ధిక్కరణకు సంబంధించిన ప్రత్యేక విచారణలను, న్యాయమూర్తులు నవీన్ చావ్లా, రవీందర్ దుదేజాలతో కూడిన ఒక డివిజన్ బెంచ్‌కు కేటాయించినట్లు సమాచారం. గత విచారణల సందర్భంగా, ఈ విషయానికి సంబంధించి  చేస్తున్న వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు, సవరించిన వీడియో క్లిప్‌ల ప్రచారంపట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 

న్యాయస్థాన ఆదేశాలపై చేసే విమర్శలు రాజ్యాంగ పరిధులకు లోబడి ఉండాలని, అటువంటి ఆదేశాలకు వ్యతిరేకంగా తగిన పరిష్కారాలు నిర్దేశిత అప్పీలు ప్రక్రియల ద్వారానే లభిస్తాయని కూడా న్యాయస్థానం పేర్కొంది. గతంలో జరిగిన కేసు విచారణకు సంబంధించిన వీడియోని కేజ్రీవాల్ సహా నిందితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫొటోలు, వీడియోల్ని కూడా షేర్ చేశారు. దీంతో ఈ అంశం వివాదాస్పదమైంది. 

కోర్టులు, న్యాయవ్యవస్థ గౌరవాన్ని తగ్గించేలా ఆమ్‌ఆద్మీ నేతలు వ్యవహరించారని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆరోపించారు. ఈ మేరకు కేజ్రీవాల్ సహా నిందితులపై దీనిపై కేసు నమోదైంది. ఇదే సమయంలో ఈ కేసు విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించారు.