ద్వీప దేశాన్ని ప్రధాన భూభాగంతో “ఏకీకృతం” చేయాలనే తన లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే ఐదేళ్లలో తైవాన్ పై చైనా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇటీవలి జరిపిన సమావేశం గొప్ప దౌత్యపరమైన విజయమని రిపబ్లికన్ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించబోమని ట్రంప్‌నకు జిన్‌పింగ్ స్పష్టం చేయడం, తైవాన్ తమదేనని తేల్చి చెప్పడంతో ఖంగుతిన్నారు.
అమెరికా వార్తా సంస్థ ఆక్సియోస్ కథనం ప్రకారం ట్రంప్-జిన్‌పింగ్ భేటీ పట్ల అమెరికా అధ్యక్షుడి అంతరంగీకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. పైకి చిరునవ్వులతో కనిపించినా చైనా అంతర్గత వ్యూహాలు ప్రమాదకరంగా ఉన్నాయని వారు భావిస్తున్నారు. ప్రపంచ వేదికపై చైనా స్థానాన్ని జిన్‌పింగ్ మార్చేస్తున్నారని, వాషింగ్టన్‌కు ఆయన స్పష్టమైన సంకేతాలు పంపారని ట్రంప్ సలహాదారు ఒకరు వెల్లడించారు.
చైనా ఎదుగుతున్న శక్తి మాత్రమే కాదని, అమెరికాకు సమానమైన శక్తిగా అవతరించామని జిన్‌పింగ్ స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు. ఇక తైవాన్ తమదేనని చైనా పరోక్షంగా హెచ్చరించినట్లు పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో తైవాన్ భవిష్యత్తుపై చైనా గట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ పర్యటన ద్వారా స్పష్టమైందని ఆయన సలహాదారు పేర్కొన్నారు.
ఒకవేళ తైవాన్‌పై చైనా దాడికి దిగితే గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ కుప్పకూలుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో తైవాన్ అగ్రగామిగా ఉంది. ఈ సప్లై చైన్‌కు అంతరాయం కలిగితే ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు, కార్ల నుండి ఎంఆర్ఐ, వాషింగ్ మెషీన్‌ల వరకు ప్రతిదానికీ శక్తినిచ్చే చిప్‌లు లేదా సెమీకండక్టర్లు.
సమీప భవిష్యత్తులో చైనా తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటే, అమెరికా కంపెనీలు ఈ విలువైన చిప్‌లను పొందే అవకాశాన్ని కోల్పోతాయి. బీజింగ్‌లో జరిగిన రహస్య చర్చల సందర్భంగా తైవాన్ ప్రధాన చర్చనీయాంశాలలో ఒకటిగా మారడంతో ఈ ఆందోళనలు తలెత్తాయి. వాణిజ్యం, సాంకేతికత, ఇరాన్ వివాదంతో పాటు తైవాన్ కూడా సదస్సు అజెండాలో ఆధిపత్యం చెలాయించింది.
చైనా, అంతర్జాతీయ మీడియా నివేదికయా నివేదికల ప్రకారం, ఈ చర్చల సందర్భంగా తైవాన్ సమస్యను సరిగ్గా నిర్వహించకపోతే అమెరికా-చైనా సంబంధాలు “ఘర్షణలు, సంఘర్షణల” వైపు మళ్లవచ్చని షీ ట్రంప్‌ను హెచ్చరించారు. మరోవైపు చైనా పర్యటనను ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్, తైవాన్‌కు ఇవ్వాల్సిన 14 బిలియన్ డాలర్ల రక్షణ ప్యాకేజీని చైనాతో చర్చల కోసం నిలిపివేసినట్లు అంగీకరించారు.
ఈ విషయంలో చైనా వైఖరిని బట్టి ముందుకెళతామని ఆయన పేర్కొన్నారు. కాగా, చైనా పక్కన ఉన్న తైవాన్ కోసం అమెరికా కొన్ని వేల కిమీ దూరం నుండి చైనాతో యుద్ధం చేయలేదని తేల్చి చెప్పారు. గత డిసెంబర్‌లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన 11 బిలియన్ డాలర్ల ఆయుధ ప్యాకేజీపై చైనా ఇప్పటికే తైవాన్ సరిహద్దుల్లో సైనిక విన్యాసాలతో నిరసన తెలిపింది. అటు తైవాన్‌లోని చిప్స్ పరిశ్రమలన్నీ అమెరికాకు తరలిరావాలని ట్రంప్ పిలుపునివ్వడం తైవాన్‌ను మరింత ఆందోళనకు గురిచేసింది.

More Stories
బెంగాల్లో వేగంగా అడుగులు వేస్తున్న సువెందు ప్రభుత్వం
రష్యాపై భారీ డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి
కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలే దేశ విభజనకు దారి తీశాయి