ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని పగటి కలలు కంటున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యురాలు డి.కె. అరుణ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజా సమస్యలపై అవగాహన కన్నా, పగటి కలలపై ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోందని ఆమె ధ్వజయంట్టారు.
“రేవంత్ రెడ్డి గారూ.. మీరు, మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, వాగ్ధానాలు ఏం అమలు చేశారో ముందుగా చెప్పండి. ఆరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమై ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం మీది” అంటూ ఆమె ధ్వజమెత్తారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు.. ఇలా ప్రతి వర్గం కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉందని ఆమె విమర్శించారు.
“మీ అసమర్థ పాలన, ప్రజా సమస్యలను పట్టించుకోని తీరు చూసి ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు, నిరుద్యోగుల ఆందోళనలు, మహిళల భద్రత సమస్యలు, పెండింగ్ హామీలు.. ఇవన్నీ పక్కన పెట్టి 2034 వరకు సీఎం కుర్చీ గురించి మాట్లాడటం ప్రజలను అవమానించడమే” అంటూ ఆమె మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత అనుకూల ఫలితాలు వచ్చాయని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని చెబుతూ ప్రజల అసలు తీర్పు వచ్చే రోజులు ముందున్నాయని, అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుందని అరుణ స్పష్టం చేశారు. ఇంకా దేశ రాజకీయాల విషయానికి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పడం హాస్యాస్పదం అంటూ ఆమె కొట్టిపారేశారు.
వరుసగా మూడు సార్లు దేశ ప్రజలు ఎన్డీయే ప్రభుత్వానికే భారీ మెజారిటీ ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి చవిచూస్తున్న వాస్తవాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని హితవు చెప్పారు. అసలు 2034 వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉంటుందా? లేక పూర్తిగా పతనమవుతుందా? అన్నదే ప్రశ్నగా మారిందని ఆమె స్పష్టం చేశారు.
అలాంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పడం ప్రజలకు నవ్వు తెప్పించే వ్యాఖ్యలని తెలిపారు. రేవంత్ రెడ్డి ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్లుకోవాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని, ఆ తర్వాత భవిష్యత్ రాజకీయాల గురించి మాట్లాడితే కనీసం ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందని ఆమె తెలిపారు.

More Stories
బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం కోసం బీజేపీ పోరాటంలో ఉద్రిక్తత
ఈనెల 21 నుండి జూన్ 1 వరకు సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు