జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం కోసం బీజేపీ పోరాటంలో ఉద్రిక్తత 

జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం కోసం బీజేపీ పోరాటంలో ఉద్రిక్తత 
జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నెల 18న నిర్వహించనున్న ఎంపీ ధర్మపురి అరవింద్ ధర్మదీక్షకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.  ఈ నేపథ్యంలో జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ భోగ శ్రావణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. 
“జగిత్యాల విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్రీయ విద్యాలయం అవసరం” అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రభుత్వం కావాలనే కేంద్రీయ విద్యాలయ ఏర్పాటును అడ్డుకుంటోందని ఆరోపించారు.  ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు భారీగా మోహరించి నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డాక్టర్ భోగ శ్రావణితో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని ఈడ్చికెళ్లారు. 

మహిళా నాయకురాలు అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించారంటూ బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి.  పోలీసులు ఈడ్చికెళ్లే సమయంలో జరిగిన తోపులాటలో డాక్టర్ భోగ శ్రావణికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఆమెను అదుపులోకి తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడ ఉద్రిక్తతను మరింత పెంచాయి. తమ నాయకురాలిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం డాక్టర్ భోగ శ్రావణితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా బీజేపీ కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ, “జగిత్యాల యువతకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో మేము పోరాటం చేస్తున్నాం. ధర్మదీక్షకు అనుమతి ఇవ్వకుండా ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. పోలీసులు బలప్రయోగంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. అయినా మా పోరాటం ఆగదు” అని హెచ్చరించారు. జగిత్యాలలో చోటుచేసుకున్న ఈ ఘటనతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్రీయ విద్యాలయం అంశం జిల్లాలో ప్రధాన రాజకీయ చర్చగా మారింది.