భగీరథ్‌ కేసులో బండి సంజయ్‌పై దుష్ప్రచారం ఆపండి

భగీరథ్‌ కేసులో బండి సంజయ్‌పై దుష్ప్రచారం ఆపండి
* సోషల్ మీడియా పోస్టులపపై జస్టిస్ మాధవీదేవి ఆవేదన 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన ఒక కేసు వ్యవహారంలో తనపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.  ఈ వివాదంలో కేంద్ర మంత్రిని లక్ష్యంగా చేసుకుని ప్రసారం చేసిన అభ్యంతరకర కంటెంట్‌ను తక్షణమే తొలగించాలంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫోక్సోకేసు వ్యవహారంలో భవిష్యత్తులో ఎక్కడా తన పేరును వాడకుండా నిలువరించాలని బండి సంజయ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రిగా తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా మీడియాలో, పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నాయని తెలిపారు. తన పేరుతోపాటు ఫొటోలు, వీడియాలు వాడకుండా మీడియాను నియంత్రించాలని పిటీషన్‌లో తెలిపారు. ఇప్పటివరకు సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్‌, ప్రముఖ టీవీల్లో, పత్రికల్లో ప్రచురితమైన వార్తలను తొలగించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంతవరకు మీడియాలో ప్రసారాలు నిలిపివేయాలని శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.  రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని కోర్టు ఆదేశించింది. బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకున్న వీడియోలు, పత్రిక క్లిప్పింగులు, డిజిటల్ కంటెంట్, వాల్ పోస్టర్లు ఈ నెల 26లోపు తొలగించాలని అదేశాలు ఇచ్చింది.

మరోవైపు బండి భగీరథ్‌ కేసులో బాలిక వివరాలు సోషల్‌ మీడియాలో ప్రసారంపై కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఛైర్‌పర్సన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో బాలిక ఫొటోలు, వీడియోలు, తల్లిదండ్రుల వివరాల ప్రసారంపై కేసు నమోదైంది. ఈ మేరకు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు బాధితురాలి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిన సోషల్‌ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

ఇలా ఉండగా,  బండి సాయిభగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్‌ టీ మాధవీదేవి సోషల్‌ మీడియాలో తన మీద జరుగుతున్న దు ష్పచారంపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. కేసు విచారణను తాను కొనసాగించడంపై ఎవరికైనా చిన్నపాటి అభ్యంతరం ఉన్నా వెంటనే చెప్పాలని, విచారణ నుంచి తప్పుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారుత

తనను, తన భర్తను దుష్ప్రచారం చేస్తూ పోస్టులు పెట్టారని న్యాయమూర్తి తెలిపారు.  వేసవి సెలవుల బెంచ్‌ను నిర్వహించిస్తున్న జస్టిస్‌ మాధవీదేవి కోర్టులో భారీ సంఖ్యలో కేసులు ఉండటంతో భగీరథ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ శుక్రవారం రాత్రి సుమారు 9 గంటలు దాటిన తర్వాత ప్రారంభమైంది. విచారణ ప్రారంభానికి ముందే న్యాయమూర్తి ఈ కేసులో వాదనలు వినిపించడానికి వచ్చిన న్యాయవాదులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

బాధితురాలి తరఫు సీనియర్‌ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు, పిటిషనర్‌ తర ఫు న్యాయవాది, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కూ డా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ‘మీలో ఎంతమంది సోషల్‌ మీడియాలో ఉన్నారు? అకడ జరుగుతున్న స్మియర్‌ క్యాంపెయిన్‌ (దుష్ప్రచారాన్ని) గమనించారా?’ అని జస్టిస్‌ మాధవీదేవి ప్రశ్నించారు.

తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తూ, తప్పుడు ఉద్దేశాలను ఆపాదిస్తూ ప్రచారం జరగడం బాధాకరమని ఆమెవాపోయారు. ‘కొందరు నన్ను ప్రభావితం చేస్తున్నారంటూ తప్పు డు ప్రచారం చేస్తున్నారు. నాకు ఆశ చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దశలో సీనియర్‌ న్యాయవాది ఎస్‌ నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ, ఇదేమీ కొత్త విషయం కాదని, గతంలో కూడా ఇదే తరహా ప్రచారం సాగింది తెలిపారు. 

పీపీ పల్లె నాగేశ్వరరావు మాట్లాడుతూ న్యాయమూర్తిపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారంపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. సీనియర్‌ న్యాయవాది ఎస్‌ నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, న్యాయవ్యవస్థను భయపెట్టే ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయని వ్యాఖ్యానించారు.

కాగా, ఈ కేసులో బాధితురాలు, పోలీసులిచ్చిన వివరాలు, ఆమె వాంగ్మూలం, పత్రాలు, తీర్పులను పరిశీలించేందుకు సమయం కావాలని, తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిస్‌ టీ మాధవీదేవి ప్రకటించారు. వచ్చే వెకేషన్‌ బెంచ్‌ ఈ నెల 21న గురువారం జరుగుతుందని, అప్పుడు తీర్పు చెప్తామని తెలిపారు.  భగీరథ్‌ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాదనలు 11.45 వరకు కొనసాగాయి.