కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును అధికారికంగా ప్రకటించింది. దానితో పది రోజులుగా కేరళం ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కేసీ వేణుగోపాల్, సతీశన్ మధ్య జరిగిన హోరాహోరీ పోటీలో చివరకు సతీశన్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఉద్ధండుల మధ్య జరిగిన పోటీలో, పినరయి విజయన్ సర్కార్‌పై పోరాడిన అనుభవం సతీశన్‌కు కలిసి వచ్చింది.
కేరళం ముఖ్యమంత్రి పదవి రేసులో రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అధిష్ఠానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అయితే కేరళంలోని పార్టీ శ్రేణులు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని వి.డి.సతీశన్‌ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన 63 మంది ఎమ్మెల్యేలలో 47 మంది కూడా వేణుగోపాల్ కే మద్దతు తెలిపారు. గతంలో కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో మంత్రిగా పనిచేసిన ఆయనకు పరిపాలనా అనుభవం కూడా ఉంది. అయినా తమకు అత్యంత నమ్మకస్తుడైన కేసీ వేణుగోపాల్‌ను కాదని, ప్రజామద్దతు ఉన్న వీడీ సతీసన్‌ను తమ కొత్త ప్రభుత్వాధినేతగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది.
“2026 మే 7న తిరువనంతపురంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో రాష్ట్రంలో సీఎల్పీకి కొత్త నాయకుడిని నియమించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పూర్తి అధికారం ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనికి అనుగుణంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా అనేక ఇతర నాయకులతో సమావేశమైన ఏఐసీసీ పరిశీలకులతో కాంగ్రెస్ అధ్యక్షుడు, సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విస్తృత చర్చలు జరిపారు. ఈ చర్చలన్నింటి ఆధారంగా వీడీ సతీశన్‌ను సీఎల్పీ నాయకుడిగా నియమించాలని నిర్ణయించారు.” అని కేరళ ఇంఛార్జ్ దాస్‌మున్షీ ప్రకటించారు.
“సతీశన్ ఎంపికపై ఎలాంటి అసంతృప్తి లేదు. నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తాను. కాంగ్రెస్‌లో హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యం. అన్నిరకాలుగా ఆలోచించే అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది” అని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
మరోవంక, తనను సీఎంగా ప్రకటించిన కొద్ది నిమిషాలకే వేణుగోపాల్‌పై సతీషన్ ప్రశంసలు కురిపించారు. ‘‘నేను ఈ పదవిని వ్యక్తిగత విజయంగా చూడను… అన్ని కార్యకలాపాలను సమన్వయం చేసింది వేణుగోపాలే.. ఆయన మద్దతు అపారమైంది. చెన్నితాల కూడా మాకు నాయకుడే… వారందరినీ విశ్వాసంలోకి తీసుకుంటాను నేను అన్ని వర్గాల ప్రజల మద్దతు కోరుతున్నాను… సమిష్టి కృషితో మాత్రమే నూతన కేరళను నిర్మించగలం.. ఒంటరిగా ఎవరూ చేయలేరు…’’ అని ఆయన పేర్కొన్నారు.
ఎర్నాకుళంకు చెందిన సతీశన్ 1964 మే 31న జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు పదేళ్లు కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్‌లో కార్యకర్తగా పనిచేశారు. 1996లో జరిగిన తన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆ తర్వాత 2001 నుంచి పరావూర్ నియోజకవర్గంలో వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. ఇటీవలి కాలంలో ప్రతిపక్ష నేతగా పినరయి విజయన్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేశారు. పదేళ్ల కమ్యూనిస్టుల పాలనకు తెరదించుతూ, 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో యూడీఎఫ్ విజయం సాధించడంలో ఆయన వ్యూహాలు కీలకంగా పనిచేశాయి.
More Stories
కేరళలో ‘ఇస్లాం ఫ్రెండ్లీ జిమ్’ ప్రకటనపై దుమారం
క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ఏర్పాటు
తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర చారిత్రాత్మకం