రాజస్థాన్‌లో వెలుగు చూసిన నీట్-యూజీ పేపర్ తొలుత మహారాష్ట్రలోని నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీకైనట్టు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. లీక్ చేసిన అనుమానిత వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. నాసిక్‌లో ఈ ప్రశ్నాపత్రం లీక్ కాగా, మే 3న జరిగిన పరీక్షకు ముందు హర్యానాకు చెందిన ఒక నివాసి ఆ “గెస్ పేపర్”ను రాజస్థాన్‌లోని కోచింగ్ కేంద్రమైన సికార్‌కు పంపారని రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజి) ఐజీ అజయ్ పాల్ లాంబా తెలిపారు.
“గెస్ పేపర్”ను అందుకున్నారని అనుమానిస్తున్న 150 మందికి పైగా నీట్ యూజీ అభ్యర్థులను, వారి స్నేహితులను, కుటుంబ సభ్యులను ఎస్‌ఓజీతో పాటు పలు జిల్లాల పోలీసు బృందాలు ప్రశ్నించాయని ఐజీ లాంబా జైపూర్‌లో మీడియాకు తెలిపారు. నాసిక్ నివాసి అయిన శుభమ్ ఖైర్నార్ ‘గెస్ పేపర్’ను హర్యానా నివాసికి పంపగా, అతను దానిని రాజస్థాన్‌లోని షెఖావతి ప్రాంతంలో ఉన్న కోచింగ్ కేంద్రమైన సికార్‌లోని పలువురు అభ్యర్థులకు ఫార్వార్డ్ చేశాడని ఆయన చెప్పారు.
“150 మందికి పైగా అభ్యర్థులు, వారి స్నేహితులు, వారి తల్లిదండ్రులను విచారించిన తర్వాత, పరీక్షలకు ముందే హర్యానా నివాసి ఒకరు ఆ పేపర్‌ను రాజస్థాన్‌కు పంపినట్లు స్పష్టమైంది. అతడిని విచారించగా, ఆ పేపర్ మహారాష్ట్రలోని నాసిక్ నుంచి అతనికి వచ్చినట్లు తేలింది,” అని ఆయన పేర్కొన్నారు. నలుగురు సభ్యుల సీబీఐ బృందం మంగళవారం నాసిక్‌కు చేరుకుని, క్రైమ్ బ్రాంచ్ నుండి ఖైర్నార్‌ను అదుపులోకి తీసుకుంది.
ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా, ప్రస్తుత కేసుకు, గతంలో రాజస్థాన్‌లో పరీక్ష పేపర్ లీక్‌లలో పాల్గొన్న ముఠాలకు మధ్య ఎలాంటి సంబంధాలు బయటపడలేదని కూడా లంబా చెప్పారు. “దీని మూలం నాసిక్ అని తేలింది. తదుపరి దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడవుతాయి,” అని లంబా వివరించారు. ఇలా ఉండగా, నీట్ (యూజీ) 2026 పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌పై జరుగుతున్న విచారణలో, రాజస్థాన్‌కు చెందిన ఒక కన్సల్టెంట్ ఏప్రిల్ నెలలోనే ప్రశ్నపత్రాలను అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నివేదికల ప్రకారం, సికార్‌లోని పిప్రాలి రోడ్డులో ఎస్కే కన్సల్టెన్సీని నడుపుతున్న రాకేష్ మందవారియా, నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రాన్ని పంపిణి చేయడంలో కీలక పాత్ర పోషించారు. అతను ఆ పేపర్‌ను కేరళలో ఎంబీబీఎస్ విద్యార్థి అని చెప్పబడుతున్న తన స్నేహితుడికి రూ. 30,000కు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విచారణలో రాజస్థాన్, కేరళ, ఢిల్లీలతో సంబంధాలు ఉన్నట్లు కూడా వెల్లడైంది. విద్యార్థులతో ఆన్లైన్, ప్రింటెడ్ వెర్షన్లు రెండింటినీ పంచుకున్నారు.
విచారణాధికారుల ప్రకారం, ఈ ఆరోపిత ప్రశ్నపత్రాన్ని మొదట్లో రూ. 5,00,000 వరకు అమ్మారు. అయితే, పరీక్ష తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, ఆ మెటీరియల్ తక్కువ ధరలకు చలామణి కావడం మొదలైంది. పరీక్షకు ముందు రోజు రాత్రి దానిని రూ. 30,000కు అమ్మారు. “చాలాసార్లు ఫార్వార్డ్ చేయబడింది” అని లేబుల్ చేసిన సంబంధిత పత్రం ఉన్న అనేక మొబైల్ ఫోన్లను ఎస్ఓజి దర్యాప్తులో కనుగొన్నారు. దీనిని బట్టి ఆ మెటీరియల్ విస్తృతంగా పంపిణీ చేసారినై దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
400 మందికి పైగా సభ్యులతో ‘ప్రైవేట్ మాఫియా’ అనే వాట్సాప్ గ్రూప్ కూడా ఉండేదని నివేదికలు ఉన్నాయి. లీక్ అయిన ప్రశ్నపత్రాలను పంచుకోవడమే దాని ఏకైక ఉద్దేశ్యమని ఆ గ్రూప్ వివరణలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ ప్రశ్నపత్రాలను గ్రూప్ వెలుపల ఫార్వార్డ్ చేయవద్దని సభ్యులకు చెప్పారు. నీట్ పరీక్ష వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే 20 మంది అనుమానితులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డెహ్రాడున్, సికర్, జున్జున్ ప్రదేశాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫీల్డ్ లెవల్ ఎంక్వైరీలు, సోదాలు చేపడుతున్నారు.
నీట్ పరీక్షను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి బాస్‌గా ప్రదీప్ కుమార్ జోషీ ఉన్నారు. 2024 నీట్ స్కామ్ జరిగినప్పుడు కూడా ఆయనే ఉన్నారు. ఆ ఏడాది సుమారు 1500 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించారు. ఆ సంవత్సరం బీహార్‌లో నీట్ పేపర్ లీకైన విషయం తెలిసిందే. నీట్ గెస్ పేపర్‌ను ఒక్కో స్టూడెంట్‌కు సుమారు రూ. 5 లక్షలకు అమ్ముకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వస్తున్నాయి.
More Stories
కాన్వాయ్‌ను సగానికి తగ్గించిన ప్రధాని మోదీ!
ప్రధాని పొదుపు చర్యలకు స్వదేశీ జాగరణ్ మంచ్ మద్దతు
సువేందు అధికారి పిఎ హత్య కేసు సీబీఐకి అప్పగింత