బంగారం, వెండిపై భారీగా పెంచిన దిగుమతి సుంకం

బంగారం, వెండిపై భారీగా పెంచిన దిగుమతి సుంకం

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్న వేళ బంగారం, వెండి సహా విలువైన లోహాల దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాన్ని భారీగా పెంచుతూ ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో బంగారం, వెండి దిగుమతి సుంకం 6 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. ఈ కొత్త రేట్లు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. 

ప్రస్తుతం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే భారీగా పడిపడి రూ.95.75 స్థాయికి చేరిన వేళ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా నిర్ణయం ప్రకారం బంగారం, వెండి దిగుమతులపై 10 శాతం బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీతో పాటు 5 శాతం అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్​ (AIDC) కేంద్రం విధించింది. దీంతో మొత్తం దిగుమతి సుంకం 15 శాతానికి చేరింది. 

ప్లాటినం, ఆభరణాల తయారీలో ఉపయోగించే విలువైన లోహాల ఉత్పత్తులపైనా ఇదే ప్రభావం పడనుంది. జ్యూవెలరీ తయారీలో ఉపయోగించే హుక్స్‌, క్లాస్ప్స్‌, క్లాంప్స్‌, పిన్స్‌, స్క్రూ బ్యాక్స్‌ వంటి భాగాలపై కూడా సుంకం పెంచారు. బంగారం, వెండి భాగాలపై 5 శాతం, ప్లాటినం భాగాలపై 5.4 శాతం కస్టమ్స్‌ డ్యూటీ విధించారు. విలువైన లోహాలు ఉన్న పాత క్యాటలిస్టులు, యాష్‌ దిగుమతులపై ఉన్న రాయితీ నిబంధనలకూ మార్పులు చేశారు.

విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించేందుకు బంగారం, వెండి కొనుగోళ్లను నియంత్రించాలన్నదే కేంద్రం ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని సూచించారు. సుంకాల పెంపు వల్ల దేశీయ మార్కెట్లో బంగారం, వెండి కొనుగోళ్లు మందగించే అవకాశముందని ఇండియా బులియన్ అండ్ జ్యూవెలరీ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహత అభిప్రాయపడ్డారు.

దేశంలో ఏటా 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగం జరుగుతుండగా, దేశీయ ఉత్పత్తి చాలా పరిమితంగా ఉంది. ఫలితంగా 90 శాతానికి పైగా బంగారం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ముడి చమురు, బంగారం కొనుగోళ్లకు అమెరికన్‌ డాలర్లలో చెల్లింపులు చేయాల్సి రావడంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. దిగుమతులు అధికమైతే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు డిమాండ్‌ పెరిగి, రూపాయి విలువ మరింత బలహీనపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. 

 

చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశం భారత్‌. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ బంగారం దిగుమతులు 24 శాతానికి పైగా పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా దాదాపు 9 శాతం ఉందని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి.