తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ప్రధాని నరేంద్ర మోదీ అ  ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో మార్పు అనివార్యమని, “అబ్‌కీ బార్ తెలంగాణాలో కూడా బీజేపీ ప్రభుత్వం” అనే నినాదం ఇప్పుడు ప్రజల సంకల్పంగా మారిందని చెప్పారు.  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం జరిగిన బీజేపీ బహిరింగ సభలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని సాధించినట్లే, తెలంగాణలో కూడా ప్రజలు కుటుంబ, అవినీతి రాజకీయాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని భరోసా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ ప్రజలను మోసం చేశాయని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి మోడల్‌, సుపరిపాలనపై మళ్లీ మళ్లీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని, పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు.  
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, ప్రజలను సంవత్సరాల పాటు బంధించిన కుటుంబ, నియంతృత్వ రాజకీయాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ అవినీతి, కుటుంబవాదం, రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే రాజకీయాలకు మారుపేరుగా మారిందని విమర్శించారు. అదే మార్గంలో టీఎంసీ కూడా నడిచిందని చెబుతూ ఇప్పుడు ప్రజలు అలాంటి రాజకీయాలను తిరస్కరిస్తున్నారని స్పష్టం చేశారు.  
ఒకప్పుడు దక్షిణాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు బీజేపీని చిన్న పార్టీగా చూసేవారని, కానీ నేడు దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజల్లో అపారమైన విశ్వాసం పెరిగిందని చెప్పారు.  అసోంలో కొద్దిమంది ఎమ్మెల్యేలతో ఉన్న బీజేపీ ఇప్పుడు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందని, బెంగాల్‌లో మూడు ఎమ్మెల్యేల స్థాయి నుంచి బీజేపీ 200కి పైగా స్థానాలకు చేరుకుందని గుర్తు చేశారు. 
తెలంగాణకు బీజేపీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంటూ దేశంలో బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న సమయంలో తెలంగాణ నుంచే ఒక ఎంపీ గెలిచారని గుర్తుచేశారు. 
మిగతా దేశంలో అంతగా మద్దతు లేకపోయినా తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ నుంచి దాదాపు సగం మంది ఎంపీలు బీజేపీ తరఫున గెలిచారని చెబుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల వాగ్దానాల మోసం, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ప్రధాని విమర్శించారు.  అందుకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, “రాష్ట్ర అభివృద్ధే దేశ అభివృద్ధి” అనే సిద్ధాంతంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో తెలంగాణ, హైదరాబాద్ కీలక పాత్ర పోషించాలని కేంద్రం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. 
తెలంగాణలో పర్యటన సందర్భంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసినట్లు ప్రధాని గుర్తుచేశారు.  అందులో దేశవ్యాప్తంగా 14 ఇండస్ట్రియల్ కారిడార్లు నిర్మాణంలో ఉన్నాయని, వాటిలో ఒకటి తెలంగాణలో ఏర్పాటు అవుతోందని చెప్పారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో వాహన తయారీ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ వరకు ఆధునిక పరిశ్రమల ఎకోసిస్టమ్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. ఇది లక్షలాది యువతకు ఉపాధి కల్పించడంతో పాటు రైతులు, మధ్యతరగతికి వరంగా మారుతుందని తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా ఆమోదించిన ఏడు పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్కుల్లో ఒకటి వరంగల్‌లో ఏర్పాటు అవుతోందని ప్రధాని వెల్లడించారు. ఇది తెలంగాణ వస్త్ర పరిశ్రమకు కొత్త ఊపునిస్తుందని, ముఖ్యంగా పత్తి రైతుల భవిష్యత్తును మార్చే ప్రాజెక్టుగా నిలుస్తుందని తెలిపారు. పత్తి ఉత్పత్తి, నాణ్యత పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల మిషన్‌ను ఆమోదించిందని, దీని ద్వారా తెలంగాణలోని లక్షలాది పత్తి రైతులకు లాభం చేకూరుతుందని చెప్పారు.

బీజేపీ అభివృద్ధి, ఉపాధి సృష్టిపై దృష్టి పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేస్తోందని ప్రధాని తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారని, ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ మోడల్ ఒకటేనని — ముందుగా అబద్ధపు హామీలు ఇవ్వడం, తర్వాత వాటిని మర్చిపోవడమేనని ఆరోపించారు. 

 
హిమాచల్‌, కర్ణాటకలో కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని, తెలంగాణలో కూడా అదే జరుగుతోందని ప్రధాని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇప్పుడు దేశాన్ని విభజించే రాజకీయాలకు కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకెళ్తోందని ఆరోపించారు. 
 
అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను “ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్”గా అభివర్ణిస్తున్నారని ప్రధాని దుయ్యబట్టారు. మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా దేశం ఎన్నో నష్టాలు చవిచూసిందని, తెలంగాణ కూడా దశాబ్దాల పాటు బాధలు అనుభవించిందని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, వామపక్షాలు మావోయిస్టులకు భావజాల పరంగా మద్దతు ఇవ్వడం వల్లే ఈ సమస్య ఇంతకాలం కొనసాగిందని తెలిపారు. 
 
తెలంగాణ పోలీసులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మావోయిస్టు ఉగ్రవాదాన్ని చాలా కాలం క్రితమే అంతం చేసేవారని స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ కృషితో ఇప్పుడు తెలంగాణ మావోయిస్టుల నుంచి విముక్తి దిశగా వెళ్తోందని చెప్పారు.