గుజరాత్‌తో సమానంగా తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పదేళ్లుగా గుజరాత్‌కే ఎక్కువ నిధులు ఇచ్చారని రేవంత్ రెడ్డి అంటున్నారని, కేంద్రం పదేళ్లలో గుజరాత్‌కు ఎంత ఇచ్చిందో చెప్పాలని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా అంటూ ఛలోక్తులు విసిరారు. మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ హైదరాబాద్ హైటెక్‌సిటీలోని హెచ్ఐసీసీ నుంచి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్‌గా చేశారు.
ఉమ్మడి ఏపీ కంటే తెలంగాణకు రైల్వే బడ్జెట్ పెంచామని ప్రధాని మోదీ తెలిపారు. హైవేలపై కేంద్రం రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, వాటి అభివృద్ధి ద్వారా తెలంగాణ కూడా లాభపడుతోందని చెప్పారు. ఉమ్మడి ఏపీలో రైల్వే బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కూడా దక్కేవి కావని గుర్తు చేశారు. ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ.ఐదున్నర వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి గారూ ఇది వింటున్నారా? తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భరోసా ఇస్తుంది’ అని ప్రధాని మోదీ ప్రత్యేకంగా చెప్పారు. తెలంగాణ వికసిస్తే దేశం కూడా వికసిస్తుందని స్పష్టం చేశారు.
సైబరాబాద్ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, అనేక పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ ప్రాణం పోసుకుంటున్నాయని తెలిపారు. సైబరాబాద్ అతి పెద్ద ఉపాధి కేంద్రంగా మారిందన్న మోదీ, సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. వరంగల్ పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్కును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, టెక్స్‌టైల్ రంగంలో వరంగల్ పీఎం మిత్ర పార్కు కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. దీంతో అక్కడ ఉద్యోగావకాశాలు భారీగా వస్తాయని చెప్పారు.
“రాజకీయాలు మాట్లాడబోనని రేవంత్ అన్నారు. నేనూ మాట్లాడను. పదేళ్లుగా గుజరాత్‌కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు. గుజరాత్‌కు ఎంత ఇచ్చామో తెలంగాణకు కూడా అంతే ఇచ్చేందుకు సిద్ధం. గుజరాత్ తరహాలో చేస్తే మీకు సగం నిధులే వస్తాయి. ఈ నిధులే మీకు సరిపోతాయా? ఈ ప్రతిపాదన నచ్చితే సీఎం రేవంత్ మాతో కలిసి నడవాలి. అభివృద్ధిలో మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అక్కడికి చేరలేదు. రాజకీయంగా కాదు. అభివృద్ధిలో నాతో కలవండి” అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మోదీ చెప్పారు.
రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలు, రవాణా, సాంకేతిక రంగాల్లో విస్తృత అవకాశాలను తీసుకురానున్నాయని ప్రధాని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా దేశం వేగంగా ముందుకు సాగుతోందని.. తద్వారా రోడ్లు, పరిశ్రమలు, డిజిటల్ మౌలిక వసతులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచడం ద్వారా భారత్‌ను గ్లోబల్ ఎకనామిక్ పవర్‌గా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సైబరాబాద్ వంటి నగరాలు దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీసహకారం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంతకు ముందు కోరారు. రాష్ట్రంలో 2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించామని చెబుతూ రెండు గంటల సమయం వెచ్చించి స్పెషల్ రివ్యూ చేయాలని ప్రధాని మోదీని కోరారు. తమ ప్రపోజల్స్‌కి ప్రధాని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశం గురించి చర్చ వచ్చినపుడు తాము రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు.
10 శాతం జీడీపీ తెలంగాణ నుంచి ఇచ్చే బాధ్యత తమదని చెప్పుకొచ్చారు. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నామని గుర్తు చేసిన ఆయన, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. 2034 నాటికి తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్‌కు మోదీ సహకరించాలని కోరారు.
“తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసుకుంటున్నాం. సికింద్రాబాద్ స్టేషన్‌ను రూ. 200 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే సికింద్రాబాద్ స్టేషన్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులా మారుతుంది. మూడేళ్ల క్రితమే ఆర్‌ఆర్‌ఆర్ పనులకు కేంద్రం అనుమతించింది. త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్ పనులు ప్రారంభించుకుంటాం. 2014 వరకూ 2400 కి.మీ. హైవేలు ఉంటే.. ఈ 11 ఏళ్లలో 2,600 కి.మీ. హైవేలు అభివృద్ధి చేసుకున్నాం” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని తెలిపారు.
అంతకుముందు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, అజహరుద్దీన్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఘనస్వాగతం పలికారు.
More Stories
అధికారంపై ఆశతో కాంగ్రెస్ మిత్రద్రోహం
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం
ముగింపు దశకు ఉక్రెయిన్‌తో యుద్ధం!