మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో సైనిక ఓటమి తర్వాత, పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా తన గూఢచర్య కార్యకలాపాలను తీవ్రంగా పెంచిన నేపథ్యంలో, 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 457 మంది పాకిస్తానీ గూఢచారులు లేదా వారితో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసినట్లు పాకిస్థాన్ ఐఎస్ఐపై పంజాబ్ పోలీసుల నివేదిక వెల్లడించింది.
ఆపరేషన్ సింధూర్ తర్వాత ఐఎస్ఐ, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (పిఐఓ) మోహరింపులను గణనీయంగా పెంచిందని, సైనిక కదలికలు, వ్యూహాత్మక స్థావరాలు, సరిహద్దు మోహరింపులపై సున్నితమైన సమాచారాన్ని సేకరించేందుకు ఆపరేటివ్‌లను నియమించిందని ఆ నివేదిక పేర్కొంది. సోషల్ మీడియా, హనీట్రాపింగ్, నగదు ప్రలోభాల ద్వారా నియామకాలను లక్ష్యంగా చేసుకున్నారు.
హవాలా మార్గాలు, ఎన్క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరిపారు. కొంతమంది గూఢచారులు సైనిక, పోలీసు స్థావరాల సమీపంలో సౌరశక్తితో పనిచేసే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయగలిగారు. కానీ సకాలంలో పట్టుబడ్డారు. పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ మాట్లాడుతూ, పంజాబ్ పోలీసులు ఇతర రాష్ట్రాలకు, కేంద్ర ఏజెన్సీలకు అనేక ఆచరణీయమైన నిఘా సమాచారాన్ని అందించారని, దాని ఫలితంగా 2025లో 437 మందిని, 2026 మార్చి వరకు మరో 17 మందిని గుర్తించామని, వీరంతా పిఐఓ ఏజెంట్లతో సంబంధాలు కలిగి ఉన్నారని తెలిపారు.
అధికారులు ఒక ముఖ్యమైన కొత్త గూఢచర్య సాధనంగా అభివర్ణించిన దానిలో, పంజాబ్ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్, 2026 మార్చి చివరి వారంలో, 2026 ఏప్రిల్ మొదటి వారంలో, ఐఎస్ఐ-ప్రాయోజిత ఆపరేటివ్‌లు స్థానిక నియామకాలను ఉపయోగించి వ్యూహాత్మక, సైనిక ప్రదేశాలలో సిమ్-సామర్థ్యం గల సోలార్ కెమెరాలను ఏర్పాటు చేయమని ఆదేశిస్తున్నట్లు గుర్తించింది.
ఈ కెమెరాల ద్వారా సైనిక కార్యకలాపాలను దూరం నుండే పర్యవేక్షించి, నిఘా ఫుటేజీని సరిహద్దు అవతల ఉన్న తమ హ్యాండ్లర్లకు పంపిస్తారు. దీనికి ప్రతిఫలంగా వారికి డబ్బు రూపంలో ప్రోత్సాహకాలు అందజేస్తారు. పరికరాలను అమర్చే బాధ్యత అప్పగించబడిన వ్యక్తులను, కెమెరాలను పనిచేయించక ముందే అడ్డుకున్నారు. దానితో ఇతర ఏజెన్సీలను అప్రమత్తం చేయడంతో ఇటువంటి అనేక గూఢచర్య ప్రయత్నాలను గుర్తించి భగ్నం చేయడం జరిగింది.
ఏప్రిల్ 11, 2026న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నిర్వహించిన ఆపరేషన్ ద్వారా ఈ ముప్పు ప్రజల దృష్టికి రాకముందే పంజాబ్ పోలీసులు గుర్తించి, క్షేత్రస్థాయి చర్యలు ప్రారంభించారని నివేదిక పేర్కొంది. పంజాబ్ పోలీసుల నిఘా సమాచారం ఆధారంగా కేవలం పంజాబ్‌లోనే కాకుండా హర్యానా, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ, మణిపూర్, బీహార్, నాగాలాండ్‌లలో కూడా చర్యలు చేపట్టారు.

More Stories
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి
తమిళనాడులో వామపక్షాలు మద్దతు ఇస్తున్నా ఉత్కంఠ!
కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు ప్రకటించిన డిఎంకె