పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాద చర్యలకు ప్రతిస్పందనగా తాము సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి అసలు స్వరూపాన్ని యావత్ ప్రపంచం చూసిందని, సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఇస్తున్న ప్రోత్సాహానికి తాము ఆపరేషన్ సిందూర్ ద్వారా తగిన బదులిచ్చామని పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. “ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేయడానికి భారత్ నిరంతరం కృషి చేస్తోంది. సీమాంతర ఉగ్రవాదం చాలా కాలంగా పాకిస్థాన్ ప్రభుత్వ విధానంలో ఒక సాధనంగా ఉందని ప్రపంచానికి తెలుసు” అంటూ ధ్వజమెత్తారు.
“సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఇస్తున్న మద్దతుకు ప్రతిస్పందనగా భారత్ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకోవాలి.” అని రణ్‌దీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ దృఢంగా, నిశ్చయంగా ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకోవడానికి భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిందని తెలిపారు. ఈ ఆపరేషన్ ఉగ్రవాద చర్యలకు జవాబుదారీతనం ఉండేలా చూడటానికి దేశ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ మేరకు జైశంకర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
“ఏడాది క్రితం పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకోవడంలో భారతదేశ సంకల్పాన్ని ఆపరేషన్ సిందూర్ ప్రతిబింబించింది. తన నిర్ణయాత్మక చర్యలతో ఉగ్రవాద చర్యలకు జవాబుదారీతనం ఉండేలా భారత్ చేసింది. శాంతి భద్రతలకు వాటిల్లిన తీవ్రమైన ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొంటామని నొక్కి చెప్పింది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనే సందేశాన్ని తెలియజేయడానికి భారత్ దృఢ నిశ్చయంతో నిలబడింది” అని తెలిపారు.
భారత సాయుధ దళాల శౌర్యాన్ని ప్రశంసించారు కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా. దేశ శాంతి భద్రతలకు ముప్పు కలిగించేవారు మన త్రివిధ దళాల బారి నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచం చూసిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ దేశ సాయుధ దళాల కచ్చితత్వం, ధైర్యం, బలాన్ని ప్రదర్శించిందని కొనియాడారు. అలాగే నిఘా సంస్థలు, వ్యూహాత్మక నాయకత్వం, త్రివిద దళాల మధ్య సమన్వయాన్ని హైలైట్ చేసిందని అభిప్రాయపడ్డారు.

More Stories
మయన్మార్ సరిహద్దులో పలు గ్రామాలపై మిలిటంట్ల దాడి!
భారీ ప్రక్షాళన దిశలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు
సువెందు పిఎ హత్యపై దర్యాప్తుకు సిట్