బీహార్ మంత్రివ‌ర్గంలోకి నితీశ్ కుమారుడు నిషాంత్

బీహార్ మంత్రివ‌ర్గంలోకి నితీశ్ కుమారుడు నిషాంత్

బీహార్‌ లో మంత్రిమండ‌లిని గురువారం విస్త‌రించారు. కొత్త‌గా 31 మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ త‌న‌యుడు నిషాంత్ కుమార్ కూడా ప్ర‌మాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. బీహార్‌లో అయిదు పార్టీల ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వాన్ని నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ స‌య్య‌ద్ అతా హ‌స్నైని మంత్రుల చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

నిషాంత్ కుమార్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి  విజ‌య్ కుమార్ సిన్హా, మాజీ మంత్రులు శ్రావ‌న్ కుమార్‌, అశోక్ చౌద‌రీలు కూడా ప్ర‌మాణం చేశారు.  ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ప్ర‌ధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖా మంత్రి రాజనాథ్‌ ‌సింగ్‌, బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌నబీన్‌, జెడియు అధ్యక్షులు నితీష్‌‌కుమార్‌‌తోపాటు పలువురు ఎన్‌‌డిఎ నేతలు పాల్గొన్నారు. అలాగే కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, లాలాన్ సింగ్, ఆర్‌‌ఎల్‌ఎం, ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు.

జేడీయూ నేత నితీశ్ కుమార్ గ‌త నెల‌లో  ముఖ్యమంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో అక్క‌డ బీజేపీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత ముఖ్యమంత్రిగా స‌మ్రాట్ చౌద‌రీ ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ఎల్‌జేపీఆర్వీ, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం పార్టీలు కూడా ఎన్డీఏ కూట‌మిలో ఉన్నాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో ముఖ్యమంత్రి, ఇద్దరు ఉపముఖ్యమంత్రులతో 35 మందితో కూడిన మంత్రివర్గం ఉంది. 243 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీకి గరిష్టంగా 36 మంది మంత్రలు ఉండవచ్చు.

కాగా, కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సామ్రాట్‌ ‌చౌదరితో సహా బిజెపికి 15 మంత్రి పదవులు, ఇక మిత్రపక్ష పార్టీ జెడియుకి 13 (ఇద్దరు డిప్యూటీ సిఎంలు : బిజేంద్ర ప్రసాద్‌ ‌యాదవ్‌, విజయ్‌ ‌కుమార్‌ ‌చౌదరి), లోక్‌ ‌జనశక్తి పార్టీ (రామ్‌ ‌విలాస్‌) : ఇద్దరు, హిందుస్తానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్) : ఒకరు, రాష్ట్రీయ లోక్ మోర్చా నుండి ఒకరు మంత్రులుగా గురువారం ప్రమాణం చేశారు.