జూన్ 1 నుండి “దక్షిణ తీర రైల్వే”

జూన్ 1 నుండి “దక్షిణ తీర రైల్వే”

భారత ప్రభుత్వం రైల్వే రంగంలో కీలకమైన పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుడుతూ “దక్షిణ తీర రైల్వే” (సౌత్ కోస్ట్ రైల్వే) అనే కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారిక గెజిట్ ద్వారా ప్రకటించింది. రైల్వే చట్టం, 1989 కింద ఉన్న అధికారాలను వినియోగిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం 2026 జూన్ 1 నుండి అమల్లోకి రానుంది. ఈ కొత్త రైల్వే జోన్‌కు ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే , సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లలోని కొన్ని విభాగాలను పునర్వ్యవస్థీకరించి కొత్త జోన్‌ను రూపొందిస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్‌లను ఈ కొత్త దక్షిణ తీర రైల్వేలో చేర్చడం జరుగుతుంది. అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్తేరు డివిజన్‌ను విభజించి, దాని ఒక భాగాన్ని విశాఖపట్నం డివిజన్‌గా మార్చి కొత్త జోన్‌లో విలీనం చేయనున్నారు.

వాల్తేరు డివిజన్ విభజన ఈ పునర్వ్యవస్థీకరణలో కీలక అంశంగా నిలిచింది. ఈ డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించి, ఒక భాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కొనసాగిస్తూ “రాయగడ డివిజన్”గా కొత్తగా ఏర్పాటు చేస్తారు. మిగిలిన భాగాన్ని “విశాఖపట్నం డివిజన్”గా మార్చి దక్షిణ తీర రైల్వేలో చేర్చనున్నారు. ఈ రాయగడ డివిజన్ పరిధిలో కొరాపుట్–సింగపూర్ రోడ్, కొత్తవలస–కిరండుల్, కునేరు–థేరు వాలి, గుణుపూర్–పారలాఖేముండి వంటి ముఖ్యమైన రైల్వే మార్గాలు చేర్చారు.

అదేవిధంగా విశాఖపట్నం డివిజన్ పరిధిలో ఇచ్చాపురం నుంచి పలాసా, విశాఖపట్నం, దువ్వాడ వరకు విస్తరించే ప్రధాన మార్గంతో పాటు విజయనగరం–కునేరు, నౌపాడ–పారలాఖేముండి, బొబ్బిలి–సాలూరు వంటి మార్గాలు ఉంటాయి.  సింహాచలం నార్త్–దువ్వాడ బైపాస్, వడలపూడి–దువ్వాడ వంటి ఉప మార్గాలు కూడా ఈ డివిజన్‌లోకి వస్తాయి. మొత్తం మీద ఈ డివిజన్ సుమారు 463 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని కలిగి ఉంటుంది.

నిర్వహణ , ఆపరేషన్ల సమన్వయాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని రైల్వే మార్గాలను ఒక డివిజన్ నుండి మరొక డివిజన్‌కు మార్చడం జరుగుతుంది.  ఖుర్దా రోడ్ డివిజన్ పరిధిలో ఉన్న పలాసా–ఇచ్చాపురం మార్గాన్ని విశాఖపట్నం డివిజన్‌కు బదిలీ చేయడం వంటి మార్పులు చేపట్టారు. అలాగే గుంటకల్, గుంటూరు, విజయవాడ , సికింద్రాబాద్ డివిజన్‌ల మధ్య కూడా కొన్ని మార్గాల పునర్విభజన జరుగుతుంది. దీనితో రైల్వే డివిజన్‌ల సరిహద్దులు కూడా కొత్తగా నిర్వచించబడతాయి.

ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా రైల్వే పరిపాలనలో సమర్థత పెరగడంతో పాటు సేవల వేగం, నిర్వహణలో సమన్వయం మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా అభివృద్ధి అవకాశాలు పెరిగి, విశాఖపట్నం ఒక ప్రధాన రైల్వే కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం రైల్వే రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించబడుతోంది.