ఓ దుండగుడు వైట్‌హౌస్‌ భద్రతా సిబ్బందిపై కాల్పులు

ఓ దుండగుడు వైట్‌హౌస్‌ భద్రతా సిబ్బందిపై కాల్పులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌‌లో ఉన్న ఓ సాయుధ దుండగుడు భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో భద్రతా సిబ్బంది అతడిపై ప్రతికాల్పులు జరిపారు. ఆ దుండగుడు కాల్పులు జరపడానికి కాసేపటి ముందే, ఆ మార్గం మీదుగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వాహన కాన్వాయ్ వెళ్లిందని అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ మ్యాథ్యూ క్విన్ మీడియాకు వెల్లడించారు. 

అత్యవసర సేవలు, భద్రతా సిబ్బందిని మోహరించినందున వైట్‌హౌస్‌, దాని పరిసర ప్రాంతాల్లో కాసేపు లాక్‌డౌన్‌ను అమలు చేశామని తెలిపారు. ఆయన కథనం ప్రకారం, వాషింగ్టన్ డీసీ నగరంలోని ఇండిపెండెన్స్ అవెన్యూ పరిధిలో ఉన్న 15వ వీధి అనేది వైట్ హౌస్‌కు దాదాపు అర కిలోమీటరుకుపైగా దూరంలో ఉంటుంది. ఇది వాషింగ్టన్ స్మారక స్థూపానికి సమీపంలోనే ఉంది. 

15వ వీధి సమీపంలోనే ఓ అనుమానిత వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆ అనుమానిత వ్యక్తి పరుగెత్తాడు. ఈక్రమంలో అతడు తుపాకీ తీసి కాల్పులు జరపగా, భద్రతా సిబ్బంది, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ప్రతికాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన ఆ దుండగుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.  ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉందనేది తెలియరాలేదు.

దుండగుడు, భద్రతా సిబ్బంది మధ్య కాల్పులు జరిగే క్రమంలో ఆ మార్గం మీదుగా వెళ్తున్న ఓ బాలుడికి గాయమైంది. ప్రస్తుతం అతడు కూడా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. కానీ బాలుడి ప్రాణానికి ఎలాంటి ముప్పూ లేదు. ఆ దుండగుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై దాడి చేయడానికే వచ్చి ఉండొచ్చా అని విలేకరులు ప్రశ్నించగా మ్యాథ్యూ క్విన్ దానిపై తాను సొంతంగా ఎలాంటి అంచనాలను వేయలేనని, ఊహాత్మకంగా ఏదేదో చెప్పలేనని స్పష్టం చేశారు.

దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవలె జరిగిన హత్యాయత్నాలతో, ఈ ఘటనకు సంబంధం ఉందో లేదో తాను ఊహించలేనని చెప్పారు. ఏప్రిల్ 25న వాషింగ్టన్‌లోని హిల్‌టన్ హోటల్‌లోనూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌‌పై కాల్పులకు కోల్ టోమస్ అలెన్ అనే 31 ఏళ్ల వ్యక్తి యత్నించాడు. వైట్ హౌస్ విలేకరులకు ఏర్పాటు చేసిన డిన్నర్ సాక్షిగా ఈ ఘటన చోటుచేసుకుంది.