ఆకివీడు రామాలయం శంకుస్థాపన సందర్భంగా ఉద్రిక్తత

ఆకివీడు రామాలయం శంకుస్థాపన సందర్భంగా ఉద్రిక్తత

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో  ఆదివారం ఉదయం 7.14 గంటలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దంపతులు రామాలయ పునఃనిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడిన రఘురామకృష్ణరాజు ఆకివీడులో రామాలయం నిర్మాణానికి కావాల్సిన అనుమతులను సకాలంలో అందించినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేశారు. 

ఆకివీడులో రామాలయం నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకుంటామని కొంతమంది హెచ్చరించిన నేపథ్యంలో పోలీసుల భద్రత మధ్యన ఈ కార్యక్రమం చేపట్టినట్లు రఘురామ వివరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ ఆకివీడు రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. కృష శిలాతో ఏడు నెలల్లో రామాలయం నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు పెదపేటలో రామాలయం నిర్మాణాన్ని కొన్ని దళిత సంఘాలు, బీఎస్పీ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గొంతెనమ్మ గుడి ప్రాంగణంలో రామాలయం నిర్మించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుంటామంటూ బీఎస్పీ పార్టీ ఛలో ఆకివీడుకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆకివీడులో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. 

 
ఛలో ఆకివీడు ప్రకటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  రామాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి యత్నించిన బీఎస్పీ నేతలు, కార్యకర్తలను పాత బస్టాండ్ సెంటర్ వద్ద పోలీసులు ఆపివేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, బీఎస్పీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 
 
దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బీఎస్పీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
మరోవైపు బీఎస్పీ కార్యకర్తల ముసుగులో అన్యమతస్తులు శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. 
 
గొంతెనమ్మకు గుడి కాన్సెప్ట్ లేదన్న రఘరామ రామాలయం ఉందని రికార్డులే చెప్తున్నాయని తెలిపారు. 80 శాతం హిందువుల ప్రతినిధిగా ఆకివీడులో రామాలయం పునర్మిర్మాణం జరిపి తీరుతామని స్పష్టం చేశారు. ఆకివీడు వ్యవహారంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని, మతం మారిన వ్యక్తులే ఇదంతా చేస్తున్నారంటూ రఘురామ ఆరోపించారు.