* టిటిడి పాలన, వ్యవస్థాగత, నిర్మాణాత్మక సంస్కరణలకై ఏకసభ్య కమిషన్ సిఫార్సు
పదవీ విరమణ పొందిన ఐఎఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. కల్తీ నెయ్యి సరఫరా జరగడానికి ఆపార్టీ కీలక నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి కూడా కారకులేనని ఏకసభ్య కమిషన్ తేల్చింది. వీరిద్దరూ ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో కొనుగోలు కమిటీ సభ్యులుగా కొనసాగారని, అంతకు ముందువరకూ పటిష్ఠంగా ఉన్న నెయ్యి సరఫరా టెండర్ల నిబంధనల సడలింపునకు వీరే తొలుత సిఫార్సు చేశారని గుర్తించింది.
టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలనుకునే డెయిరీలను రెండేళ్ల పాటు ఎంప్యానల్ చేయాలని టెండరు నిబంధనల సవరణ కోసం ఏర్పాటైన కమిటీ సూచించినా దాన్ని బేఖాతరు చేశారని పేర్కొంది. కొనుగోలు కమిటీకి కన్వీనరైన టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ విభాగం జనరల్ మేనేజర్, టెండరు నిబంధనల సవరణ కోసం ఏర్పాటైన కమిటీ కన్వీనర్, సభ్యులు హాజరు కాకున్నా చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఆర్థిక సలహాదారు ఒ.బాలాజీ, మరో సభ్యుడు ఎం.రాములు సమావేశమై టెండర్ల నిబంధనల సడలింపు సిఫార్సులకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేశారని ఏకసభ్య కమిషన్ నివేదికలో పేర్కొంది.
అయితే, ఏకసభ్య కమిషన్ వారిపై చర్యలకు మాత్రం సిఫార్సు చేయలేదు. అసాధారణం అనిపించేంత తక్కువ ధరలకు నెయ్యి సరఫరా చేస్తామంటూ కొన్ని డెయిరీలు బిడ్‌లు దాఖలు చేయగా అది సాధ్యమేనా? అనే కనీస అనుమానాలైనా వ్యక్తం చేయకుండా ఆ బిడ్‌లను కొనుగోలు కమిటీ గుడ్డిగా ఆమోదించేసింది. నాణ్యతను కాపాడటంలో విఫలమైంది. దానివల్లే ఆయా సంస్థలు టీటీడీకి కల్తీనెయ్యి సరఫరా చేయగలిగాయి.
నెయ్యి కొనుగోళ్ల టెండర్లలో రివర్స్ ఆక్షన్‌లో ఎల్1గా నిర్ణయించిన ధరను సదరు డెయిరీ ఆ తర్వాత ఒక లేఖ ద్వారా తగ్గించినప్పుడు కూడా కొనుగోలు కమిటీ కాంట్రాక్ట్ ఖరారు చేయాలని సిఫార్సు చేసేది. ఇలా సంప్రదింపులతో చేయడం టెండర్ నిబంధనలకు విరుద్ధమైనా కమిటీ పట్టించుకోలేదు. కాంట్రాక్ట్ ఖరారు టెండర్ నిబంధనల్ని పక్కాగా అమలు చేయడంలోనూ విఫలమైంది. పైగా కల్తీ నెయ్యి సరఫరాకు అనువైన పరిస్థితులన్నింటినీ కొనుగోలు కమిటీయే సృష్టించింది. టీటీడీకి నాణ్యమైన సరకులు సరఫరా జరిగేలా చూడటంలో కీలకమైన కొనుగోలు కమిటీ దానికి తూట్లు పొడిచేలా వ్యవహరించింది.
అప్పట్లో ఈవోగా పనిచేసిన అనిల్‌కుమార్ సింఘాల్, ఆర్థిక సలహాదారు, చీఫ్ ఎకౌంటింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన బాలాజీ, ప్రొక్యూర్‌మెంట్ జీఎంలు జగదీశ్వర్‌రెడ్డి, ఆర్ఎస్ఎస్ వి సుబ్రహ్మణ్యం, నెయ్యి నిపుణుడు బి.సురేంద్రనాథ్, డెయిరీ నిపుణుడు ఎం.విజయభాస్కరరెడ్డిల చర్యలు కల్తీ నెయ్యి సరఫరాకు ఎలా కారణమయ్యాయో కూడా నివేదికలో వివరించింది. వారిలో కొందరిపై చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించింది.
నెయ్యి కల్తీ వ్యవహారంలో టీటీడీ బోర్డు పర్యవేక్షణ, పాలన తీరు ఆందోళన కలిగించిందని, బోర్డులో నిర్మాణాత్మక మార్పులు చేయాలని కమిషన్ అభిప్రాయం వెల్లడించింది. అసలు చట్టం 1987లోని 30 విభాగం సెక్షన్ 97కు 2023లో మార్పులు చేసి సుమారు 55 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తున్నారని, ఈ నియామకాలకు అవకాశం కల్పించే 2023 చట్టం 1లోని సెక్షన్ 97 సబ్ సెక్షన్-సి, సెక్షన్ 97 సబ్ సెక్షన్-డిను శాశ్వతంగా రద్దు చేయాలని కమిటీ సూచించింది.

More Stories
ఫోరెన్సిక్ రిపోర్టునే ఫోర్జరీ చేసిన సీఎం మాన్‌ను అరెస్ట్ చేయండి
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్
ఉగ్రవాదం, సైబర్ ముప్పులపై బ్రిక్స్ ఉక్కుపాదం మోపాలి