* ట్రంప్- పుతిన్ సుదీర్ఘంగా టెలిఫోన్ సంభాషణ!
అణు కార్యక్రమానికి సంబంధించి త్వరలో దౌత్యపరమైన పరిష్కారం కుదరకపోతే అమెరికా మరింత కఠిన వైఖరి తీసుకుంటుందని టెహ్రాన్‌ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. దీనికితగ్గట్టుగానే ఇరాన్‌ని బెదిరిస్తున్నట్లుగా ట్రంప్ చేతిలో తుపాకీ పట్టుకుని ఉన్న ఫొటోని తన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ఈ ఫొటోకి ‘ఇకపై మంచివాడిగా ఉండను’ అని క్యాప్షన్ పెట్టారు.
ఒప్పందానికి సంబంధించి ఇరాన్ సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోతుందని ఆయన మండిపడ్డారు. అణ్వాయుధ రహిత ఒప్పందంపై ఎలా సంతకం చేయాలో వారికి (ఇరాన్ నేతలకు) తెలియదు అంటూ ధ్వజమెత్తారు. కాగా, వారు త్వరగా బుద్ధి తెచ్చుకోవడం మంచిది అని ట్రంప్ ఇరాన్ నేతల్ని హెచ్చరించారు. హార్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ అమెరికాకు కొన్ని షరతుల్ని విధించింది. వాటిలో ప్రధానంగా యుద్ధం ముగిసిన తర్వాత అణు కార్యక్రమానికి సంబంధించి చర్చలు జరపాలని ఇరాన్ తెలిపింది.
అయితే అణు కార్యక్రమంపై స్పష్టమైన వివరణలు చెప్పకపోవడంతో ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాషింగ్టన్ ప్రతిపాదించిన షరతులను టెహ్రాన్ ప్రతిఘటిస్తూనే ఉంటే, మరింత దూకుడు విధానాన్ని అవలంబించే అవకాశం ఉందని సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేశారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోకుండా ఆలస్యం చేస్తున్న ఇరాన్‌పై ఆగరహం వ్యక్తం చేస్తూ ఇకపై తాను మంచివాడికి కాను అంటూ ట్రంప్ ప్రకటించారు.
అణు ఒప్పందం విషయంలో ఇరాన్‌కు కొత్త ప్రతిపాదనలు చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. వాటిని అంగీకరించాలని సూచించారు. కాగా, శాంతి చర్చలు విఫలమై, హొర్ముజ్ మూసివేత కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ఇతర పద్ధతుల కన్నా నౌకా రేవుల దిగ్బంధానికి తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో ట్రంప్ పేర్కొన్నట్లు తెలిసింది.
మరోవంక, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య జరిగిన కీలకమైన టెలిఫోన్ సంభాషణ గంటన్నరకు పైగా సాగింది. ఈ సంభాషణలో ఇద్దరు నాయకులు ప్రపంచంలోని కొన్ని అత్యంత కీలకమైన ఉద్రిక్త అంశాలపై చర్చించారు. క్రెమ్లిన్ ప్రకారం, ఈ సంభాషణ “స్నేహపూర్వకంగా, వృత్తిపరంగా” జరిగింది.
మధ్యప్రాచ్యంలోని పరిణామాలపై, ముఖ్యంగా ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై ఇద్దరు నాయకులు అధిక ప్రాధాన్యత ఇచ్చారని క్రెమ్లిన్ ధృవీకరించింది. పుతిన్ అగ్ర దౌత్య సలహాదారు యూరి ఉషాకోవ్ విలేకరులతో మాట్లాడుతూ, నాయకులు “ఇరాన్, పర్షియన్ గల్ఫ్‌లోని పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు” అని వివరించారు. ఆ సంభాషణలో, విజయ దినోత్సవం (మే 9) సందర్భంగా ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణను ప్రకటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని పుతిన్ ట్రంప్‌కు తెలిపారు.

More Stories
నైతిక సాంకేతికత కోసం దత్తాత్రేయ హోసబాలే పిలుపు
మున్నెన్నడూ లేని విధంగా ప్రజాదరణ కోల్పోతున్న ట్రంప్
ట్రంప్ ఫొటోతో అమెరికా పాస్‌పోర్టులు