పశ్చిమ బెంగాల్లో కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు మినహా రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 89.99శాతం పోలింగ్ నమోదైంది. బెంగాల్లో 294 స్థానాలు ఉండగా ఏప్రిల్ 23న 152 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియగా బుధవారం 142 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ విడతలో 1,448మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 3.21 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
ఇందుకోసం 41వేలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. పలుచోట్ల ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. భవానీపుర్ నియోజవర్గంలో సీఎం మమతా బెనర్జీ ఓటు హక్కు వినియోగించున్నారు. టీఎంసీ ఎంపీలు మహువా మెయిత్రా, అభిషేక్ బెనర్జీ, బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రెండో దశలో పోటీ పడుతున్న కీలక అభ్యర్థుల్లో సీఎం దీదీ, ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఉన్నారు. భవానీపూర్ నియోజకవర్గంలో మమతపై సువేందు అధికారిని బీజేపీ పోటీకి నిలిపింది. భాత్ పాడా, రాణాఘాట్, కోల్‌కతా ఉత్తర్, కోల్‌కతా దక్షిణ్, రాశ్ బెహారీ, జాధవ్ పుర్, బాలీగంజ్లు రెండో దశలో కీలకంగా ఉన్నాయి. బెంగాల్లో తుదిదశ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. అనేకచోట్ల హింస, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు జరిగాయి.
చాప్ర, శాంతిపూర్, నిమ్తలా, భాంగర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు. చాప్రాలో ఉన్న బూత్ నంబర్ 53లో బీజేపీ ఏజెంట్ మోషారెఫ్ మీర్‌పై దాడి జరిగింది. వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. అధికార టిఎంసికి చెందిన దుండగులు తమ పోలింగ్ ఏజెంట్‌పై దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది.
అటు హావ్‌డా జిల్లా బల్లి ప్రాంతంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దీని వల్ల అక్కడున్న వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి అది కాస్తా ఘర్షణకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఘర్షణను అదుపు చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాయి. ఓటింగ్ సందర్భంగా హుగ్లీ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
నకిలీ పోలింగ్ ఏజెంట్లను నియమించారన్న ఆరోపణలతో టిఎంసి, ఐస్ఎఫ్ మద్దతుదారుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పోలీసులు జోక్యం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కంచుకోటైన డైమండ్ హార్బర్లోని ఫల్తా నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్‌లలో ఓట్లు ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఫల్తా నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్‌ల్లో కమలం గుర్తు కనిపించకుండా చేసి, ఓటేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని బీజేపీ ఆరోపించింది. ఓటింగ్ యంత్రంలో కమలం గుర్తు దగ్గర ఉన్న బటన్‌ను వినియోగించకుండా దానిని టేప్‌తో కప్పి ఉంచినట్లు బిజెపి బంగాల్ కో-ఇన్‌ఛార్జి అమిత్ మాలవీయ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఘటనలు జరిగిన అన్ని బూత్‌ల్లో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన బెంగాల్ ఎన్నికల కమిషనర్ పోలింగ్ బూత్‌ల్లో బటన్ల ట్యాంపరింగ్‌పై వచ్చిన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అవి నిజమని తేలితే ప్రభావిత బూత్‌ల్లో తిరిగి పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

More Stories
పశ్చిమ బెంగాల్లో మళ్లీ దీదీదే అధికారం?
అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ… పుదిచ్చేరిలో మళ్లీ ఏన్‌డీఏనే
తమిళనాడులో మరోసారి డీఎంకే.. కేరళలో యూడీఎఫ్ సర్కార్.