ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ ఖాయం

ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ ఖాయం

ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం సాధించడం ఖాయమని, బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. మే 4న వెలువడే ఫలితాలు దేశాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయిలో బుధవారం జరిగిన గంగా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటూ  కేరళ, తమిళనాడు, అసోం, బెంగాల్​, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్ఛేరి ఎన్నికల్లో విజయం తమదేనని స్పష్టం చేశారు. 

‘‘పశ్చిమ బెంగాల్‌లో రెండో దశలో కూడా ఓటర్లు భారీ ఎత్తున ఓటింగ్​లో పాల్గొంటున్నారు. ఈసారి ఎన్నికలు గతంలోలాగా భయానక వాతావరణంలో కాకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. గత ఆరు, ఏడు దశాబ్దాలలో ఎప్పుడూ ఇలా ఎన్నికలు జరగలేదు. పశ్చిమ బెంగాల్ ఓటర్లు భారీ స్థాయిలో ఓటింగ్‌లో పాల్గనడం ప్రజాస్వామ్యం బలోపేతానికి, రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం” అని ప్రధాని ప్రశంసించారు. 

“ఈ విషయంలో బెంగాల్ ప్రజలకు నా ధన్యవాదాలు. ఓటింగ్​కు ఇంకా కొన్ని గంటల సమయం ఉంది. ప్రజలంతా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇటీవల బిహార్ ఎన్నికలు, తర్వాత గుజరాత్ సివిల్ ఎన్నికలలో విజయం తర్వాత ఇప్పుడు వెలువడబోయే ఫలితాలతో బీజేపీ హ్యాట్రిక్ సాధించడం ఖాయం” అని వివాసం వ్యక్తం చేశారు.

“ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. మే 4న వెలువడబోయే ఫలితాలు దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాయి. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడం ద్వారా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు తాము మహిళా వ్యతిరేకులమని నిరూపించుకున్నాయి” అని ధ్వజమెత్తారు. “యూపీ ప్రగతిని చూసి సమాజ్‌వాదీ పార్టీ అసంతృప్తితో ఉంది. వాళ్లు ఇంకా యూపీని వెనక్కు తీసుకెళ్తామని అనుకుంటున్నారు. సమాజాన్ని విడదీయాలని చూస్తోంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు మహిళా వ్యతిరేక పార్టీలే కాకుండా దేశ అభివృద్ధి వ్యతిరేక పార్టీలు కూడా” అంటూ మోదీ విమర్శించారు.