ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళా బిల్లుపై వెనక్కి తగ్గం

ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళా బిల్లుపై వెనక్కి తగ్గం

ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు వెనక్కి తగ్గమని, పోరాడుతూనే ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  పార్లమెంట్‌ లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం కోసం తాము ఎంతగానో ప్రయత్నించామని, అయితే కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీలాంటి ప్రతిపక్ష పార్టీల నీచ రాజకీయాలవల్లే ఆ చట్టం అమల్లోకి రాకుండా ఆగిపోయిందని ప్రధాని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

మహిళలు అభివృద్ధి చెందడం, అసెంబ్లీలు, పార్లమెంట్‌కు రావడం ప్రతిపక్షాలకు ఇష్టంలేదని వారణాసిలో నారీశక్తి మహిళా సదస్సులో పాల్గొంటూ ఆయన ధ్వజమెత్తారు. అందుకే 40 ఏళ్లుగా ఈ బిల్లును అడ్డుకుంటూనే ఉన్నారని అంటూ వారణాలో జరిగిన ఓ సభలో ప్రధాని విమర్శించారు.  ప్రతిపక్షాలు తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి సాకులు వెతుకుతున్నాయని ప్రధాని విమర్శించారు.
భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో మహిళలు కేంద్ర బిందువులని ప్రధాని అభివర్ణిస్తూ, “అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే సంకల్పం అవిశ్రాంతంగా కొనసాగుతోంది; నేను ‘వికసిత్ భారత్’ గురించి మాట్లాడినప్పుడు, దానికి అత్యంత బలమైన మూలస్తంభం భారతదేశ ‘నారీ శక్తి’యే” అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన సుమారు రూ. 6,350 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు, వాటికి శంకుస్థాపన చేశారు.

లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయడమనే మహా యజ్ఞాన్ని మొదలు పెట్టేందుకు తాము సిద్ధమవుతున్నామని ప్రధాని తేల్చి చెప్పారు. అందుకోసం మాతృమూర్తుల ఆశీస్సులు తీసుకునేందుకు వారణాసి వచ్చానని ప్రధాని చెప్పారు. ఈ బిల్లును తేవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.మహిళా రిజర్వేషన్‌ బిల్లు రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదని ప్రధాని చెప్పారు.

సాధారణ కుటుంబాల మహిళలు పార్లమెంటు, అసెంబ్లీలకు రావాలని కోరుకున్నానని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అధికారం తమ కుటుంబాలకే పరిమితం కావాలని కోరుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లపై తమ పోరాటం ముగిసిపోలేదని, చట్టాన్ని అమలు చేసేవరకు పోరాడుతూనే ఉంటామని చెప్పారు.

“గత 40 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ల అమలుకు ఈ పార్టీలే అడ్డుకట్ట వేశాయి. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ మరోసారి దీనికి ‘రెడ్ సిగ్నల్’ (అడ్డు) చూపించింది. మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. మీ రిజర్వేషన్ హక్కులు అమలు అయ్యేలా చూడటానికి నేను శాయశక్తులా కృషి చేస్తాను. అసలు నిజం ఏమిటంటే, ఈ కుటుంబ రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలపై ఆధారపడే పార్టీలన్నీ మహిళల శక్తిని చూసి భయపడుతున్నాయి. మీ అందరినీ చూసి వారు భయపడుతున్నారు” అంటూ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. 

అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్‌- ముంబయి మధ్య రైలు అనుసంధానాన్ని పెంచుతూ రెండు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రై‌ళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని ఈ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. వారణాసి-పుణె, అయోధ్య-ముంబయి మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. కొత్తగా ప్రారంభించిన అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ద్వారా కాశీ విశ్వనాథ క్షేత్రం, అయోధ్య రామ ముందిరానికి చేరుకోవడం సులభతరమవుతుందని ప్రధాని మోదీ తెలిపారు. 
 
ముంబయి, పుణె వంటి మెట్రో నగరాల నుంచి నేరుగా రైలు సౌకర్యం కల్పించడం వల్ల పర్యాటక రంగానికి భారీ ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఈ రైళ్ల రూపకల్పన జరిగినట్లు వెల్లడించారు.