పరస్పర అంగీకారంతో కూడిన సహ జీవన సంబంధాలు విచ్ఛిన్నమైన తర్వాత వాటిని నేరంగా పరిగణించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది. ఇటువంటి ఏర్పాట్లు సహజంగానే ఇద్దరు భాగస్వాములకు అనిశ్చితి, చట్టపరమైన నష్టాలను తెస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. పెండ్లి చేసుకుంటానని బూటకపు వాగ్దానం చేసి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఒక మహిళ చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న సహజీవన సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
భాగస్వాములలో ఎవరైనా ఎప్పుడైనా విడిపోవడానికి స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు. తప్పుడు వివాహ హామీతో లైంగిక దాడి చేశారంటూ తన మాజీ సహజీవన భాగస్వామిపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వును ఆమె సవాల్ చేసింది. న్యాయమూర్తులు బి.వి. నాగర త్న, ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం ఈ కేసును విచారించింది.
మహిళ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చాలా కాలం పాటు కలిసి నివసించారని, వారికి ఒక సంతానం కూడా ఉందని ధర్మాసనం గమనించింది. వీరిరువురూ కలిసి జీవించారు. వారికి ఒక బిడ్డ కూడా ఉంది. వివాహం జరగలేదని ఇప్పుడు లైంగిక దాడి అంటున్నారు. 15 సంవత్సరాలు కలిసి జీవించారు అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తికి ఇప్పటికే వివాహమైందని, అతను ఆమెను మోసం చేసి వేధించాడని మహిళ తరఫు న్యాయవాది వాదించగా ‘పరస్పర అంగీకారంతో సంబంధం ఏర్పడినపుడు ఇక నేరం అన్న ప్రశ్న ఎక్కడ వస్తుంది?’ అని ప్రశ్నించారు.
వివాహం చేసుకుని ఉంటే మహిళకు న్యాయపరమైన హక్కులు చాలా బలంగా ఉండేవని న్యాయమూర్తి చెప్పారు. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెను లైంగికంగా వేధించాడని కోర్టుకు వివరించారు. దీనిపై జస్టిస్ నాగరత్న స్పందిస్తూ, అయితే వివాహానికి ముందే ఎందుకు అతనితో కలిసి జీవించింది? అని ప్రశ్నించారు. ఆమె అతనితో కలిసి సహజీవనం చేసింది. అతనితో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. చట్టబద్ధమైన వివాహ బంధం లేకపోవడంతో అతను వెళ్లిపోయాడు. సహజీవన సంబంధాల్లో ఇదే ప్రమాదం అని ఆమె హెచ్చరించారు.
ఒకసారి అతను వెళ్లిపోయిన తర్వాత అది క్రిమినల్ నేరంగా మారదు అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మహిళ తరఫు న్యాయవాది, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇప్పటికే వివాహితుడని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచిపెట్టాడని తెలిపారు. దీనిపై జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ, వివాహం జరిగి ఉంటే ఆమెకు ప్రశ్నించే హక్కు బలంగా ఉండేది. రెండో పెళ్లి అని కేసు పెట్టే అవకాశం ఉండేది. భరణం కోరే హక్కు ఉండేది. ఇప్పుడు వివాహం లేకుండా కలిసి జీవించారు. ఇదే సహజీవన సంబంధాల్లో ఉన్న ప్రమాదం అని తెలిపారు.

More Stories
సాహిబ్ మదర్సా చట్టవిరుద్ధం
దక్షిణ బామునియా పేలుడులో కీలక నిందితుడు అరెస్ట్
ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు అంతంత మాత్రమే