తన అంతరాత్మ ప్రభోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ‘న్యాయం జరుగుతుందన్న ఆశలు ఆవిరయ్యాయి. అందుకే మహాత్మా గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాను. వ్యక్తిగతంగా గానీ, కనీసం నా తరపు న్యాయవాది ద్వారా గానీ విచారణకు హాజరుకాను’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే, చట్టపరంగా తనకు ఉన్న హక్కుల ప్రకారం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆయన స్పష్టం చేశారు.
మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌తో పాటు ఇతర నిందితులను ట్రయల్ కోర్టు గతంలో విడుదల చేసింది. దీనిని సవాలు చేస్తూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారిస్తున్నారు. అయితే, ఈమె గతంలో కేజ్రీవాల్ అరెస్ట్‌ను సమర్థిస్తూ తీర్పునిచ్చారని, అలాగే ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఈ కేసు నుంచి ఆమె తప్పుకోవాలని కేజ్రీవాల్ పిటిషన్ వేశారు.
గత వారం (ఏప్రిల్ 20) ఈ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ కొట్టివేశారు. ‘న్యాయమూర్తుల నిజాయితీని లిటిగెంట్లే విచారించలేరు. కేవలం ఊహల ఆధారంగా రీక్యూసల్ కోరలేరు’ అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థపై కేజ్రీవాల్‌కు గౌరవం లేదని బీజేపీ విమర్శిస్తుంటే, తమ నాయకుడికి అన్యాయం జరుగుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా ఉంటే, నేటి విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు కావడంతో హైకోర్టు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

More Stories
భారత్, న్యూజిలాండ్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
బీజేపీలో ఆప్ ఎంపీల విలీనాన్ని ఆమోదించిన రాజ్యసభ చైర్మెన్
సరిహద్దు మౌలిక సదుపాయాలకు నిధులు కోరిన అరుణాచల్ సీఎం