బీజేపీలో ఆప్ ఎంపీల విలీనాన్ని ఆమోదించిన రాజ్య‌స‌భ చైర్మెన్

బీజేపీలో ఆప్ ఎంపీల విలీనాన్ని ఆమోదించిన రాజ్య‌స‌భ చైర్మెన్
అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరిన విలీన ప్ర‌క్రియ‌ను సోమ‌వారం రాజ్యస‌భ చైర్మెన్ సీపీ రాధాకృష్ణ‌న్ ఆమోదించారు. దీంతో రాజ్య‌స‌భ వెబ్‌సైట్ ప్ర‌కారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల సంఖ్య 10 నుంచి మూడుకు ప‌డిపోయింది. ఇక బీజేపీ సంఖ్య 106 నుంచి 113కు చేరింది.  ఇక రాజ్య‌స‌భ‌లో ఎన్డీఏ బ‌లంగా ఇప్ప‌డు 141 నుంచి 148కి పెరిగింది. దీంతో రాజ్య‌స‌భ‌లో మెజారిటీ మార్క్ అయిన 123 సంఖ్య‌కు బీజేపీ చేరువు అవుతున్న‌ట్లు తెలుస్తోంది. 
బీజేపీలో విలీనమైన ఏడుగురు ఆప్ ఎంపీల్లో రాఘవ్‌ చడ్ఢా, సందీప్ పాఠక్, అశోక్ కుమార్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతీ మాలీవాల్, రాజీందర్ గుప్తా, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ ఉన్నారు.  ఇప్పుడు రాజ్యసభలో మిగిలిన ఆప్ ఎంపీల్లో సంజయ్ సింగ్ (డిల్లీ), ఎన్‌ డీ గుప్తా (డిల్లీ), బల్బీర్ సింగ్ సీచేవాల్ (పంజాబ్) ఉన్నారు. బీజేపీలో చేరిన‌ట్లు ఆమ్ ఆద్మీ పార్టీలు స‌మ‌ర్పించిన‌ విలీన లేఖ‌పై రాజ్య‌స‌భ చైర్మెన్ రాధాకృష్ణ‌న్ న్యాయ‌ప‌ర‌మైన అభిప్రాయాన్ని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఏడుగురు ఆప్ ఎంపీలు ఆ లేఖ‌పై సంత‌కం చేశారు.
 
 ఆ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ ఎంపీల సంఖ్య‌లో 2/3 మెజారిటీ ఉండడంతో ఎంపీల విలీన ప్ర‌క్రియ‌కు దాదాపు క్లియ‌రెన్స్ వ‌చ్చేసింది.  ఆప్ ఎంపీలు రాసిన లేఖ రాజ్యాంగంలోని ప‌ద‌వ షెడ్యూల్‌కు త‌గిన‌ట్లు ఉంద‌ని రాజ్యస‌భ్య చైర్మెన్ భావిస్తున్న‌ట్లు తెలిసింది. ఆ షెడ్యూల్ ప్ర‌కారం 2/3 మెజారిటీ ఉంటే, విలీనాన్ని ఆమోదించ‌వ‌చ్చు.  బీజేపీలో ఏడుగురు ఆప్ ఎంపీల విలీనాన్ని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించారంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.
ఇక నుంచి రాఘవ్‌ చడ్ఢా, సందీప్ పాఠక్, అశోక్ కుమార్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతీ మాలీవాల్, రాజీందర్ గుప్తా, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సభ్యులని ఆయన వెల్లడించారు.  ఈ ఏడుగురు ఎంపీలు ఎన్నడూ రాజ్యసభలో దూషణలు చేయలేదని, క్రమశిక్షణారాహిత్యం, అసమంజస ప్రవర్తనలకు వారు పాల్పడలేదని కిరణ్ రిజిజు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశ నిర్మాణం చేస్తున్న ఎన్‌డీఏ కూటమిలోకి ఆ ఎంపీలకు స్వాగతం పలుకుతున్నానని ఆయన తెలిపారు. ‘తుక్డే తుక్డే ఇండి అలయన్స్’కు ఇక వీడ్కోలు అని వ్యాఖ్యానించారు.