పాక్ ద్వారా అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు?

పాక్ ద్వారా అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు?
* పుతిన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి  అరాగ్చీ ఆకస్మిక భేటీ!

అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు, హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు అందించింది అంటూ ఓ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఈ ప్రతిపాదనలను మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్థానీ అధికారుల ద్వారా అమెరికాకు ఇరాన్ చేరవేసిందని పేర్కొంది.  తీవ్రరూపం దాల్చిన పశ్చిమాసియా సైనిక ఘర్షణలో దీన్ని కీలక పరిణామంగా ఆ మీడియా కథనం అభివర్ణించింది.

చర్చలకు సిద్ధం అయితే ఇరాన్ ఎప్పుడైనా తమకు సందేశాన్ని పంపొచ్చని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు పొందే అవకాశాన్ని ఇరాన్‌కు ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇరాన్ ప్రతిపాదించిన ఈ ప్రణాళికలో యుద్ధం, జలసంధి భద్రత, అణు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. అందులో మొదటి దశలో భాగంగా యుద్ధానికి పూర్తిస్థాయిలో ముగింపు పలకాలి. భవిష్యత్తులో ఇరాన్, లెబనాన్‌లపై ఎలాంటి దాడులు జరగవని అమెరికా హామీ ఇవ్వాలి. ఇక రెండో దశలో భాగంగా.. యుద్ధం ముగిసిన తర్వాతే అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి నిర్వహణ, పరిపాలనపై ఇరు దేశాలు చర్చలు జరుపుతాయి. 

ఇక మూడో దశలో భాగంగా పైన పేర్కొన్న రెండు దశలు విజయవంతమైతేనే అమెరికా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న అణు అంశం, యురేనియం నిల్వలపై ఇరాన్ చర్చలకు వస్తుంది. ఇరాన్ ప్రతిపాదనపై వైట్‌హౌస్ ప్రతినిధి ఒలీవియా వేల్స్ స్పందిస దౌత్యపరమైన చర్చలు పత్రికల ద్వారా సాగవని కుండబద్దలు కొట్టారు.  “అమెరికా ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండనివ్వబోమని మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం చర్చలు నిర్వహించాలా లేదా అన్న నిర్ణయం మా చేతుల్లోనే ఉంది” అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ట్రంప్ కూడా ఇరాన్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 

మరోవంక, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మధ్య సోమవారం జరగనున్న భేటీ అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా కూటమితో ఇరాన్ యుద్ధం సాగిస్తున్న తరుణంలో మాస్కో వేదికగా జరగనున్న ఈ సమావేశం యుద్ధ గమనాన్ని మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదివారం ఇస్లామాబాద్ పర్యటన ముగించుకున్న అరాగ్చీ నేరుగా రష్యాకు బయలుదేరారు. అంతకుముందు ఆయన ఒమన్ దేశంలో కూడా పర్యటించారు.