ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఉన్నత విద్యావంతుడే!

ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఉన్నత విద్యావంతుడే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొన్న వైట్‌హైస్ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌ మీట్‌లో కాల్పులకు పాల్పడిన నిందితుడు ఒక ఉన్నత విద్యావంతుడిగా వెల్లడైంది. అతడిని దర్యాప్తు బృందాలు 31 ఏళ్ల కోలో టామోస్‌ అలెన్ ‌గా గుర్తించాయి. కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెలెస్‌ శివార్లలో ఉన్న టోరెన్స్‌ ప్రాంత వాసిగా గుర్తించారు.  అతడి లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌ ప్రకారం కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి 2017లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేశాడు.

థామస్‌ అలెన్‌ 2017లో కాల్టెక్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడే వీల్‌ఛైర్స్‌కు ఎమర్జెన్సీ బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా రూపొందించాడు. ఈ అంశం గురించి స్థానిక పత్రికలో కథనం కూడా వెలువడింది.  ఆ తర్వాత కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తిశాడు. 2018లో ఓ వీడియోగేమ్‌ను కూడా తయారు చేసి ట్రేడ్‌మార్క్‌ కోసం రిజిస్టర్‌ చేసుకొన్నాడు. ఇటీవల ‘ఫస్ట్‌లా ’ పేరిట మరో గేమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు లింక్డిన్‌లో వెల్లడించాడు.

2014లో జెట్‌ ప్రొపెల్షన్‌ ల్యాబ్‌లో నాసా నిర్వహించిన ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌లో కూడా అతడు పాల్గొన్నాడు. ప్రస్తుతం టెస్ట్‌ ప్రిపరేషన్‌ ట్యూటరింగ్‌ కంపెనీ సీ2 ఎడ్యూకేషన్‌లో టీచర్‌గా పనిచేస్తున్నట్లు ప్రొఫైల్‌లో ఉంది. డిసెంబర్‌ 2024లో టీచర్‌ ఆఫ్‌ ది మంత్‌గా కూడా ఎంపికయ్యాడు. ఇక రాజకీయ నేపథ్యం చూస్తే డెమోక్రటిక్‌ పార్టీకి సానుభూతిపరుడిగా తెలుస్తోంది. కమలా హ్యారిస్‌ అధ్యక్ష ప్రచారానికి 25 డాలర్లు విరాళం కూడా ఇచ్చినట్లు ఫెడరల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ రికార్డులు చెబుతున్నాయి.

కాగా, ఈ ఘటనతో అమెరికాలో హైప్రొఫైల్ ఈవెంట్ల భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక వ్యక్తి బహుళ ఆయుధాలతో చెక్‌పాయింట్ వరకు చేరుకోవడం ఎలా సాధ్యమైందన్న దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే భద్రతా వ్యవస్థ వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. వాషింగ్టన్ డీసీ పోలీస్ అధికారులు మాట్లాడుతూ, ముందస్తు భద్రతా ప్రణాళిక సక్రమంగా అమలయ్యిందని, వెంటనే చర్యలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు. 

ట్రంప్‌ పై గతంలోనూ పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఆయనపై 2016లో తొలి దాడి జరిగినప్పటి నుంచి మృత్యువుగా నీడలా వెంటాడుతూనే ఉంది. అయితే దాడి జరిగిన ప్రతిసారీ ట్రంప్‌ సురక్షితంగా బయటపడుతూ వస్తున్నాడు. 2016 నుంచి ఇప్పటివరకు గత దశాబ్ద కాలంలో ట్రంప్‌పై ఐదుసార్లు దాడులు జరిగాయి.