`తెలంగాణ రాష్ట్ర సేన’ పార్టీ ఏర్పాటు ప్రకటించిన కవిత

`తెలంగాణ రాష్ట్ర సేన’ పార్టీ ఏర్పాటు ప్రకటించిన కవిత
 
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్ఎస్) అని ప్రకటించారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుతో కూడిన జెండాను ఆవిష్కరించారు. మధ్యలో తెలంగాణ మ్యాప్, దానిపై టిఆర్ఎస్  అనే అక్షరాలతో పార్టీ జెండాను రూపొందించారు. 
 
అనంతరం ప్రసంగించిన కవిత తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోవటంతోనే తాను తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. “ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లైనా మన కలలు పూర్తిగా నెరవేరలేదు. ఉద్యమ నేత కేసీఆర్ గారి అభివృద్ధి రథం గాడి తప్పింది” అని చెప్పారు. 
 
“గతంలో కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పుల్లో నేనూ భాగంగా ఉన్నా. తప్పుకి ఇప్పుడు క్షమాపణ చెబుతున్నా. తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నా. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది. నేను తెలంగాణలోని మూడున్నర కోట్ల మందికి అమ్మగా పరిణితి చెందాలని అనుకుంటున్నా. అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకుపోతుంది. ప్రజల కష్టాలు తీరుతాయి” అని ప్రకటించారు. 
 
“సామాజిక తెలంగాణే లక్ష్యంగా ముందుకు వెళ్తాం. తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. బీజేపీకి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదు. ఇక బీఆర్ఎస్ నీళ్లు, నిధులు, నియామకాలను గాలి కొదిలేసింది. ఆనాడు టీఆర్ఎస్ కోసం పని చేశా. ఆనాటి కేసీఆర్ వేరు.. ఇప్పుడు కేసీఆర్ వేరు. ఇప్పుడున్న కేసీఆర్ మారిన మనిషి. మర మనిషి. మన మనిషి కాదు” అంటూ తండ్రిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
“ప్రజలకు కష్టం వస్తే కేసీఆర్ రావటం లేదు. గుంట నక్కల చేతుల్లో ఖైదీ అయిన వ్యక్తి కేసీఆర్. అధికారం ముందు మమకారం తగ్గిందా? కేసీఆర్ గారు రాజకీయ పరిణితి లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కర్కోటకుడి పాలన నడుస్తుంటే కేసీఆర్ పట్టించుకోవటం లేదు. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. కేసీఆర్ మారుతారేమోనని వేచి చూసినా మారలేదు” అంటూ తండ్రిపై విమర్శలు కురిపించారు. 
 
“నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి మంచే చేశారు. ఆ పార్టీలో ఉండి నేను గట్టిగా పోరాడలేకపోయా.  కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెబితే నన్ను పక్కన పడేసి పందికొక్కులను పక్కన పెట్టుకున్నారు. ఇది ప్రారంభం మాత్రమే.. ఇప్పుడు మనమే ప్రతిపక్షం అవుతాం.. రెండేళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం” అని కవిత ధీమా వ్యక్తం చేశారు.