నావికుల భద్రతపై భారత్ ఆందోళన

నావికుల భద్రతపై భారత్ ఆందోళన
హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో నౌకలపై కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, అక్కడి “భారత నావికుల భద్రతపై ఆందోళన” వ్యక్తం చేస్తున్నట్లు భారత నౌకా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఈ ఘటనల్లో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొంది. భారత ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ మాట్లాడుతూ, కాల్పులకు గురైన రెండు విదేశీ జెండాలు గల నౌకలలో 22 మంది భారతీయ నావికులు ఉన్నారని తెలిపారు.
 
“ఈ కాల్పుల్లో ఏ భారతీయ నావికుడూ గాయపడలేదు,” అని ఆయన చెప్పారు. సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి కనీసం 2,680 మంది భారతీయ నావికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. తీవ్రమవుతున్న ఈ ‘ట్యాంకర్ యుద్ధం’లో వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధి తాజా ఉద్రిక్త కేంద్రంగా మారింది. 
 
హార్ముజ్ జలసంధి వద్ద కార్గో నౌకలపై కాల్పులు జరిపి, ఆ నౌకల్ని ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ నావికా దళం అదుపులోకి తీసుకున్న వ్యవహారానికి సంబంధించిన వీడియోను ఇరాన్ తాజాగా విడుదల చేసింది. హార్ముజ్‌లో మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసింది. మొదటగా నౌకలపై కాల్పులు జరిపింది. ఆ తర్వాత నౌకలోకి ప్రవేశించిన సైన్యం.. వాటిని తమ నియంత్రణలోకి తీసుకుంది. అనుమతి లేకుండా, అక్రమంగా హార్ముజ్ దాటేందుకు ప్రయత్నించినందునే తాము ఈ పని చేశామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. 
 దాడికి గురైన నౌకల్లో ఒక నౌక ఇండియాలోని గుజరాత్ రావాల్సి ఉంది. లైబీరియాకు చెందిన ఎపామినోండాస్ అనే నౌక దుబాయ్ నుంచి ఇండియా వస్తుండగా, ఇరాన్ స్వాధీనం చేసుకుంది. నౌకలపై కాల్పులు జరపడంతో ఒక నౌక స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. నౌకను సైన్యం స్వాధీనం చేసుకున్న తీరు హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నట్లు ఉంది. సాయుధులైన సైనికులు.. ముసుగులు ధరించి, పడవలో కార్గో షిప్ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత నిచ్చెన సహాయంతో పడవలోకి చేరుకున్నారు.  ట్రంప్‌ ప్రభుత్వంతో తదుపరి విడత చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఇరాన్‌ నాయకత్వం కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్లు నౌకల స్వాధీనం సూచిస్తున్నది.