రేవంత్ పర్యటనలో ఎన్‌డిఎస్‌ఏ ఛైర్మన్… బండి సంజయ్ ఆగ్రహం

రేవంత్ పర్యటనలో  ఎన్‌డిఎస్‌ఏ ఛైర్మన్… బండి సంజయ్ ఆగ్రహం
ఈ నెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం జరిపిన మేడిగడ్డ పర్యటనలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఏ) ఛైర్మన్ అనిల్ జైన్‌ పాల్గొనడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి చెడ్డ పేరు తెచ్చేలా యత్నించిన ఎన్‌డిఎస్‌ఏ చైర్మన్ అనిల్ జైన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌కు లేఖ రాశారు. 
 
పైగా, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల వద్ద వెయ్యి బోర్ హోల్స్ తవ్వాలని ఎన్డీఎస్ నివేదిస్తే అందుకు భిన్నంగా 100 బోర్ హోల్స్ తవ్వితే సరిపోతుందని చెప్పడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఎస్‌ఏ సూచించిన పరీక్షలను నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, బ్యారేజీల స్థితిపై భూగర్భ, భూభౌతిక పరీక్షలు నిర్వహించాని సూచించి రెండేళ్లయినా పురోగతి లేదని ఆయన విమర్శించారు. 
 
ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డలో కేవలం 6 బోర్ హోల్స్ మాత్రమే పూర్తి చేసిందని ఆయన తెలిపారు. అన్నారం, సుందిల్లలో ఒక్క బోర్ హోల్స్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. మే చివరి నాటికి బోర్ హోల్స్‌ను పూర్తి చేయాలని సూచించినా పట్టించుకోవడం లేదని, నిర్ణీత గడువులోగా బోర్ హోల్స్ పూర్తి చేయలేమని గ్రహించి ఎన్డీఏస్ ఛైర్మన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఆయన ఆరోపించారు.

రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం మేడిగడ్డను సందర్శించారని, రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఎన్‌డిఎస్‌ఏ చైర్మన్ అనిల్ ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఎస్‌ఏ కమిటీ నిర్ణయాలను ఒక వ్యక్తి ఎలా అధిగమిస్తారని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో బ్యారేజీలకు మరింత నష్టం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్‌డిఎస్‌ఏపై నిందలు మోపే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

అయితే, ఎన్‌డిఎస్ ఏ  చైర్మన్ ఈ నెల 20న మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శన పూర్తిగా అధికారిక, సాంకేతిక పరమైనదేనని, దానికి రాజకీయ రంగు లేదని సాగునీటి శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌డిఎస్‌ఏ చైర్మన్ పర్యటన ఉద్దేశ్యం ప్రస్తుత పరిశోధనల పురోగతిని సమీక్షించడం, అలాగే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బృందాలకు సాంకేతిక మార్గదర్శకత్వం ఇవ్వడమేనని తెలిపారు. 
 
ఈ పర్యటన పూర్తిగా ఎన్‌డిఎస్‌ఏ అధికారిక సాంకేతిక పర్యవేక్షణ మాత్రమేనని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ ప్రణాళికా, ప్రామాణిక ప్రమాణాలు, ఇంజినీరింగ్ పద్ధతులు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించడానికే ఉద్దేశించినదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఆనకట్టల భద్రతకు సంబంధించి అగ్రగామి సంస్థ అయిన ఎన్‌డిఎస్‌ఏ, మేడిగడ్డ బ్యారేజ్‌లో కుంగిన పిల్లర్లు ఘటన అనంతరం గతంలో తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
 
ముఖ్యమంత్రి, సాగునీటి మంత్రులు మేడిగడ్డను సందర్శించినప్పుడు ఎన్‌డిఎస్‌ఏ చైర్మన్ మీడియా సమావేశాల్లో పాల్గొనలేదని శ్రీధర్ గుర్తుచేశారు. ఇందులో చైర్మన్ పాత్ర పూర్తిగా సాంకేతిక పరిశీలన, మార్గదర్శకత్వం వరకే పరిమితమైందని, దానికి ఎలాంటి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయవద్దని కోరారు.