ఉదయనిధి ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో రూ. 7.36 కోట్ల పెట్టుబ‌డి అదృశ్యం

ఉదయనిధి ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో రూ. 7.36 కోట్ల పెట్టుబ‌డి అదృశ్యం

డీఎంకే నేత ఉద‌య‌నిధి స్టాలిన్ ఎన్నిక‌ల అఫిడ‌విట్‌పై ఆదాయ‌ప‌న్ను శాఖ ఆరోప‌ణ‌లు చేసింది. రెడ్ గెయింట్ మూవీస్‌లో రూ. 7.36 కోట్లు పెట్ట‌బ‌డి పెట్టిన‌ట్లు 2021 ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో డీఎంకే నేత ఉద‌య‌నిధి స్టాలిన్ పేర్కొన్నార‌ని, కానీ 2026 ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఆ అంశాన్ని ప్ర‌స్తావించ‌లేద‌ని మ‌ద్రాసు హైకోర్టుకు ఆదాయ‌ప‌న్ను శాఖ తెలిపింది. 

అయితే ఆ కంపెనీలో ఉద‌య‌నిధి స్టాలిన్ భార్య పేరుపై సుమారు రూ. 2.63 కోట్లు పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు తాజా ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఉన్న‌ట్లు ఆదాయ‌ప‌న్ను శాఖ వెల్ల‌డించింది. కానీ ఈ అంశాన్ని గ‌త అఫిడ‌విట్‌లో ప్ర‌స్తావించ‌లేద‌ని ఆదాయపన్ను శాఖ చెప్పింది. ఎన్నిక‌ల అఫిడ‌విట్లు, ఆదాయ రికార్డుల్లో చాలా తేడా ఉన్నట్లు కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లైన కేసులో ఆదాయ‌ప‌న్ను శాఖ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 

బ్యాంకు రుణాల అంశంలోనూ తేడా ఉన్న‌ట్లు ఐటీశాఖ తెలిపింది.  బ్యాంకుల నుంచి రూ. 10 కోట్ల రుణం తీసుకున్న‌ట్లు 2026 అఫిడ‌విట్‌లో ఉంద‌ని, కానీ 2021 అఫిడ‌విట్‌లో రూ. 11.06 కోట్ల రుణం తీసుకున్న‌ట్లు ఉంద‌ని ఐటీశాఖ‌ పేర్కొన్న‌ది. కానీ కంపెనీ రికార్డుల ప్ర‌కారం మాత్రం సుమారు  రూ.18 కోట్లు రుణం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.  గ‌ణాంకాల అంశంలో గంద‌ర‌గోళం ఉంద‌ని, ట్యాక్స్ రిట‌ర్న్స్‌ను ఐటీఆర్-2 ఫార్మాట్ కింద మ‌ళ్లీ ఫైల్ చేయాల‌ని ఆదాయ‌ప‌న్నుశాఖ చెప్పింది.

ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించ‌డంలో తేడా ఉన్న‌ట్లు చెన్నై నివాసి ఆర్ కుమార‌వేల్ దాఖ‌లు చేసిన పిటీష‌న్ ఆధారంగా ఈ కేసు విచార‌ణ జ‌రుగుతున్న‌ది.  ఎన్నిక‌ల అఫిడ‌విట్ ప్ర‌కారం ఉద‌య‌నిధి స్టాలిన్ త‌న ఆస్తుల విలువ సుమారు రూ. 20.6 కోట్లుగా చూపించారు. దీంట్లో  రూ. 12.9 కోట్లు చ‌రాస్తులు కాగా, రూ. 7.7 కోట్లు స్థిరాస్తి ఉన్న‌ది. ఉద‌య‌నిధి స్టాలిన్ 2024-25 ఆదాయం రూ. 10 ల‌క్ష‌లు కాగా, అత‌ని భార్య మాత్రం రూ. 2.9 కోట్లు ఆర్జించింది.