అమెరికా, ఇరాన్‌ రెండో దశ చర్చలపై అనిశ్చితి

అమెరికా, ఇరాన్‌ రెండో దశ చర్చలపై అనిశ్చితి
* పాక్ కు బయలుదేరిన అమెరికా బృందం.. చర్చలకు ఇరాన్ సానుకూలం!
 
పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్‌ మధ్య జరగాల్సిన రెండో దశ చర్చలపై అనిశ్చితి నెలకొంది. అమెరికా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోందని పేర్కొన్న ఇరాన్‌, శాంతి చర్చలకు తమ ప్రతినిధి బృందాన్ని పంపే విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. అయితే, రెండో విడత శాంతి చర్చలకు వచ్చే ప్రసక్తి లేదంటూ భీష్మించుకుని కూర్చున్న ఇరాన్‌ ఎట్టకేలకు మనసు మార్చుకుంది. 
 
ఇరాన్‌ నౌకపై అమెరికా దాడి చేయడంతో ఇరాన్‌ అమెరికా నౌకలపై డ్రోన్లతో ప్రతీకార దాడులకు పాల్పడింది. పైగా అమెరికా మాట మీద నిలబడటం లేదని ఇరాన్‌ నాయకత్వం ఆక్షేపించింది. చివరకు మాత్రం చర్చలకు అంగీకరించింది. అమెరికాతో జరగబోయే శాంతి చర్చల్లో పాల్గొనడాన్ని సానుకూలంగా సమీక్షిస్తున్నామని తెలిపింది. అయితే దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయెల్‌ బఘాయ్‌ తెలిపారు. 
 
ఈ సందర్భంగా అమెరికా అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. ‘ఇరాన్‌ మా కార్గో నౌకపై ఉదయం దాడి చేసింది. మా నౌకాశ్రయాలపై అమెరికా దిబ్బంధం ఇంకా కొనసాగిస్తూ అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. లెబనాన్‌లో కాల్పుల విరమణను కూడా ఆలస్యంగా అమలు చేస్తున్నది’ అని ఆరోపించారు. 
 
కాగా, మరోవైపు  అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌, సీనియర్‌ అధికారులతో కూడిన అమెరికా ప్రతినిధుల బృందం రెండో విడత చర్చలకు వేదికైన పాక్‌కు బయలుదేరింది. చర్చలకు వచ్చేది రానిదీ ఇరాన్‌ ఇంకా చెప్పలేదని, అయితే తప్పక హాజరవుతుందన్న ఆశాభావంతో ఉన్నామని ఒక అధికారి తెలిపారు. మొదటి విడత చర్చల్లో కొన్ని అంశాల్లో ఇరువురి మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడిందని, అయితే ఈసారి చర్చలు ఫలవంతమవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

కాగా, ఇరాన్​తో చారిత్రాత్మక దౌత్యపరమైన పురోగతిని సాధించేందుకు తమ ప్రభుత్వం దగ్గరలోనే ఉందని వైట్​హౌస్ తెలిపింది. గత దౌత్య ప్రయత్నాలతో పోలుస్తూ, అమెరికా అధ్యక్షుడు అనుసరించిన విలక్షణమైన విధానమే ఈ పురోగతికి కారణమని వైట్​హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామా కుదుర్చుకున్న ఒప్పందానికి భిన్నంగా, ఇరాన్‌తో ఒక మంచి డీల్​కు అమెరికా ఎప్పుడూ ఇంత దగ్గరగా రాలేదని తెలిపారు.

ఈ చర్చల ప్రధాన లక్ష్యం ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయించడం అని ట్రంప్ స్పష్టం చేశారు. “ఇరాన్ అణ్వాయుధాలను పూర్తిగా వదులుకోవాలి. ఇదే ప్రధాన షరతు” అని ఆయన తెలిపారు. అవసరమైతే తాను కూడా ఇరాన్ నాయకులతో ప్రత్యక్షంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ వెల్లడించారు. అయితే, చర్చలు విఫలమైతే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

అయితే ఇరాన్‌ ఓడరేవులపై తాము విధించిన దిగ్బంధనాన్ని ధిక్కరించే ఏ నౌకనైనా స్వాధీనం చేసుకుంటామన్న తన హెచ్చరికను అమెరికా ఆదివారం అమలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్‌తో ఆ సంబంధం ఉన్న ఎం/వీ టౌస్కా నౌకపై ఉత్తర అరేబియా సముద్రంలో ఒక క్షిపణి విధ్వంసక నౌక కాల్పులు జరుపడం, ఆ తర్వాత ఆగిపోయిన నౌక డెక్‌పైకి హెలికాప్టర్ల నుండి తాడు సాయంతో సైనికులు దిగిన దృశ్యాలు ఉన్న వీడియో ఫుటేజ్‌ని అమెరికన్‌ సైన్యం విడుల చేసింది. 

ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణను పొడిగించే అవకాశం ‘దాదాపు తక్కువ’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన కొన్ని గంటల తర్వాత వైట్​ హౌస్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఒప్పందం కుదిరితే, అది ఇజ్రాయెల్, మధ్యప్రాచ్యానికే కాకుండా యూరప్, అమెరికా, ఇంకా మిగతా అన్ని దేశాలకూ శాంతి, భద్రత, సురక్షితత్వాన్ని హామీ ఇస్తుందని మంగళవారం వైట్ హౌస్ పేర్కొంది.