బెంగాల్ కిరాణా షాపులో మరమరాల మిక్చర్‌ కొన్న మోదీ

బెంగాల్ కిరాణా షాపులో మరమరాల మిక్చర్‌ కొన్న మోదీ
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక సామాన్యమైన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భద్రతా వలయాలను పక్కన పెట్టి, సామాన్యుడిలా ఝూర్‌గ్రామ్‌లోని ఒక చిన్న దుకాణంలో రుచిరకమైన మరమరాలు (ఝుల్‌మురిని) తింటూ కొద్దిసేపు అక్కడి స్థానికులతో మమేకమయ్యారు. బెంగాల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రుచిరకమైన స్నాక్‌గా ఝుల్‌మురికి పేరుంది.
 
పశ్చిమ బెంగాల్‌లోని ఝామ్ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ప్రధాని మోదీ ఒక్కసారిగా తన కాన్వాయ్‌ను ఆపాలని ఆదేశించారు.  భారీ భద్రత మధ్య సాగుతున్న ప్రధాని వాహన శ్రేణి ఆగిపోవడంతో అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ, మోదీ కారు దిగి నేరుగా రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న కిరాణా షాపులోకి నడుచుకుంటూ వెళ్లడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 
 
ఏ దేశ ప్రధాని అయినా సాధారణంగా ప్రజల మధ్యకు వెళ్లడం అరుదు, అలాంటిది ఒక మారుమూల ప్రాంతంలోని షాపులోకి వెళ్లడం ఆ ప్రాంత ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.  షాపులోకి వెళ్లిన మోదీ అక్కడ కేవలం అతిథిలా ఉండిపోకుండా, ఒక సాధారణ కస్టమర్‌లా మారిపోయారు. అక్కడున్న  ఝుల్‌మురి కొన్ని చిరుతిళ్లను స్వయంగా కొనుగోలు చేశారు. 
 
వాటిని తింటూనే, ఆ షాపు యజమానితో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఆ ప్రాంత సమస్యల గురించి, వారి జీవనశైలి గురించి ఆరా తీశారు.  తెల్లటి కుర్తా, డార్క్ బ్లూ కోట్, ఎరుపురంగ స్కార్ఫ్, దానిపై ఎంబ్రాయిడరీ అల్లికతో ఉన్న బిజీపే గుర్తుతో మోదీ ఎంతో ఉల్లాసంగా కనిపించారు. పలువురు తమ స్మార్ట్ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ క్షణాలను ప్రధాని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో షేర్ చేశారు. నాలుగు ర్యాలీల మధ్యలో రుచికరమైన మరమరాలు తిన్నానని అందులో పేర్కొన్నారు.

కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి నగదును కూడా ఆయనే స్వయంగా చెల్లించడం విశేషం. ప్రధాని తమతో అంత దగ్గరగా కూర్చుని మాట్లాడటం చూసి షాపు యజమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రధాని మోదీ అకస్మాత్తుగా ప్రజల మధ్యలోకి రావడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. 

తమ అభిమాన నాయకుడిని అంత దగ్గరగా చూసిన స్థానికులు ‘భారత్ మాతాకీ జై’, ‘జై శ్రీరామ్’, ‘మోదీజీ జిందాబాద్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ ఘటన మోదీకి ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరోసారి నిరూపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు వారించినా, ప్రజల మధ్యకు వెళ్లడానికే తాను ఇష్టపడతానని ఈ చర్య ద్వారా మోదీ చెప్పకనే చెప్పారు.