మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఓడించడం ద్వారా ప్రతిపక్షాలు ‘భ్రూణహత్య’కు పాల్పడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ముగిసిన కొన్ని గంటల తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, శుక్రవారం లోక్‌సభలో మహిళా కోటా బిల్లు ఫ్లోర్ టెస్ట్‌లో నెగ్గకపోవడంతో ప్రధాని దేశంలోని మహిళలను “క్షమాపణ కోరారు”.
“మన మహిళల కలలు ఎలా చితికిపోయాయో భారతదేశంలోని ప్రతి పౌరుడు చూస్తున్నాడు,” అని ప్రధానమంత్రి తన ప్రసంగంలో తెలిపారు. పార్లమెంట్లో బిల్లును వ్యతిరేకించిన పార్టీలపై దాడి చేస్తూ, “ప్రతిపక్ష పార్టీల స్వార్థ రాజకీయాల కారణంగా భారతదేశ మహిళా సాధికారత కోసం జరుగుతున్న పోరాటం కుంటుపడింది,” అని ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
లోక్‌సభలో బిల్లుకు మూడింట రెండు వంతుల మెజారిటీ లభించకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు “పాపం చేశాయని” ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఆరోపించారు. “మహిళా రిజర్వేషన్‌ను వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు పాపం చేశాయి, దీనికి వారు ఖచ్చితంగా శిక్షించబడతారు,” అని ఆయన హెచ్చరించారు. “కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ వంటి పార్టీలు మహిళా రిజర్వేషన్ల బిల్లును ఓడించి ‘భ్రూణహత్య’కు పాల్పడ్డాయి,” అని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ “తన గత తప్పులను సరిదిద్దుకుంటుందని” తాను ఆశించానని, కానీ ఆ పార్టీ “కొత్త చరిత్రను లిఖించే అవకాశాన్ని కోల్పోయిందని” ప్రధాని మండిపడ్డారు.
తన ప్రసంగంలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఒక “సంస్కరణ వ్యతిరేక పార్టీ” అని, వారు బ్రిటిష్ వారి నుండి విభజించి పాలించే వ్యూహాన్ని నేర్చుకున్నారని ఆరోపించారు. “కుటుంబ పార్టీలు మహిళలు ముందుకు రావడాన్ని కోరుకోవు, ఎందుకంటే మహిళలు వారి స్వార్థ రాజకీయాలకు ముగింపు పలకగలరు,” అని కూడా ఆయన విమర్శించారు.
“కాంగ్రెస్ పార్టీ సంస్కరణలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమే. ఆ పార్టీ చేసేవన్నీ నెగిటివ్ రాజకీయాలు. పేదల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. నోట్లరద్దు, జీఎస్టీ, డిజిటల్ పేమెంట్స్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అలాగే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ రద్దు వంటి అన్నింటినీ కాంగ్రెస్ వ్యతిరేకించింది. అన్ని సంస్కరణలను అడ్డుకోవటమే ఆ పార్టీ సిద్ధాంతం. కాంగ్రెస్ విధానాల వల్ల దేశానికి తీవ్రనష్టం కలుగుతోంది” అంటూ ప్రధాని మండిపడ్డారు.
నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ, ప్రధానమంత్రి ఇలా అన్నారు: “కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజలను విభజించే రాజకీయాలను నమ్ముతుంది. అందుకే వారు ఉత్తర-దక్షిణ విభజన గురించి తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు.” ఆయన ఇంకా ఇలా చెప్పారు: “ఒక మహిళ అన్నీ మరచిపోతుంది, కానీ తన అవమానాన్ని కాదు; కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేసిన ఈ అవమానం ప్రతి మహిళ హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది.”
నారీ శక్తి వందన అధినియమ్‌ను వ్యతిరేకించడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి వంశపారంపర్య పార్టీలలో ఉన్న భయమేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. “మహిళలకు సాధికారత కల్పిస్తే, తమ నాయకత్వానికి సవాలు ఎదురవుతుందని వారు భయపడుతున్నారు. తమ కుటుంబాలకు వెలుపల ఉన్న మహిళలు ఎదగడాన్ని వారు కోరుకోవడం లేదు” అని విమర్శించారు.
“ఈనాడు లక్షలాది మంది మహిళలు పంచాయతీలు, స్థానిక సంస్థలలో తమ సామర్థ్యాలను నిరూపించుకున్నారు. ఇప్పుడు లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళలకు మరిన్ని సీట్లు లభిస్తాయి. వారి ప్రాతినిధ్యం పెరుగుతుంది. అందుకే ఈ పార్టీలు సవరణను వ్యతిరేకించాయి” అని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ తన ప్రసంగంలో, మహిళా కోటా బిల్లు దేశానికి “తక్షణ అవసరం” అని నొక్కిచెప్పారు. దీనిని అమలులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. “ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సమతుల్య సాధికారతను నిర్ధారించడానికి నారీ శక్తి వందన్ సవరణ తక్షణ అవసరం, ఇది ఒక నిజాయితీ ప్రయత్నం,” అని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న “ప్రతికూల వైఖరి” వల్లే దేశంలోని చాలా సమస్యలు తలెత్తుతున్నాయని ప్రధాని ఆరోపించారు. “ఈనాడు మన దేశం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సవాలుకూ, గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రతికూల వైఖరే కారణం,” అని ఆయన ఆరోపించారు. “మన దేశ మహిళలు కాంగ్రెస్‌కు, దాని మిత్రపక్షాలకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు,” అని ప్రధానమంత్రి హెచ్చరించారు.

More Stories
ప్రముఖ జర్నలిస్ట్, మాజీ ఎంపీ బల్బీర్ పుంజ్ మృతి
హర్మూజ్ జలసంధిలో భారతీయ నౌకలపై ఇరాన్ కాల్పులు
ఆటిజం పిల్లలలో ప్రారంభ దశలో జోక్యం అత్యంత అర్ధవంతం