హర్మూజ్ జలసంధిలో భారతీయ నౌకలపై ఇరాన్ కాల్పులు

హర్మూజ్ జలసంధిలో భారతీయ నౌకలపై ఇరాన్ కాల్పులు

* ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు

అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న దాగుడు మూతల యుద్ధంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. హర్మూజ్ జలసంధికి సంబంధించి అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటు ఇరాన్ చేస్తున్న ప్రకటనలతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హర్మూజ్‌ జలసంధిని తెరిచి ఉంచినట్లు ప్రకటించిన ఇరాన్ మళ్లీ ఒక్కరోజులోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం సంచలనం రేపుతోంది.  

 
ఈ క్రమంలోనే హర్మూజ్‌ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన 2 నౌకలపై ఐఆర్‌జీసీకి చెందిన గన్ బోట్‌లు కాల్పులు జరిపినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. అయితే ఆ రెండు నౌకలు భారతీయ జెండాలతో ప్రయాణిస్తున్నట్టు వెల్లడి కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  భారత జెండాలతో హర్మూజ్ జలసంధిని దాటుతున్న రెండు నౌకలపై ఐఆర్‌జీసీ గన్‌ బోట్‌లు జరిపిన కాల్పుల్లో ట్యాంకర్లకు గానీ, ఆ నౌకల్లో ఉన్న సిబ్బందికి గానీ ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా ఉన్నట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. 

అయితే ఈ కాల్పుల ప్రభావం ఎంతవరకు ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా హర్మూజ్‌ జలసంధిలో భారత జెండాలతో కూడిన నౌకలపై ఇరాన్ ఐఆర్‌జీసీ చేసిన దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే భారత్ శనివారం ఇరాన్ రాయబారి డాక్టర్ మహమ్మద్ ఫతాలీని పిలిపించింది. 
 
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాలలో ఒకటైన దీని గుండా జరిగే వాణిజ్య నౌకల భద్రతపై ఈ చర్య కొత్త ఆందోళనలను రేకెత్తించింది. పిలిపించిన తర్వాత ఇరాన్ రాయబారి విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి బయలుదేరి రాయబార కార్యాలయానికి తిరిగి వెళ్తున్న దృశ్యాలను ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రచురించింది. ఈ కాల్పుల ఘటనపై భారత్ కూడా నిరసన తెలిపింది.
 
మరోవైపు భారత్ కు చెందిన చమురు నౌక ఒకటి శనివారం హార్ముజ్ జలసంధిని దాటింది. దేశ్ గరిమ అనే నౌక ఈ జలసంధిని దాటినట్లు అక్కడి ట్రాఫిక్ డాటా ద్వారా తెలిసింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత జలసంధిని దాటిన పదో భారత నౌక ఇది. ఖతార్‌లోని రస్ లాఫ్ఫాన్ పోర్టు నుంచి ఈ నౌక భారత్ కు వస్తోంది. ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ ఒమన్ వద్ద ఈ నౌక ఉన్నట్లు తెలుస్తోంది. 
 
మొత్తంగా ఈ రోజు హార్ముజ్ నుంచి వివిధ దేశాలకు చెందిన ఎనిమిది నౌకలు దాటినట్లు అంచనా. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తున్నట్లు ప్రకటించడానికి ముందే ఈ నౌకలు ఈ ప్రదేశాన్ని దాటి ఉండొచ్చు. ప్రస్తుతం హార్ముజ్‌ను ఇరాన్ మూసేసిన నేపథ్యంలో మళ్లీ నౌకల రవాణా నిలిచిపోనుంది. హార్ముజ్ ప్రస్తుతం ఇరాన్ మిలిటరీ నియంత్రణలో ఉంది.