పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తీసుకొచ్చిన కీలక రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్షాల వైఖరి దేశ మహిళలకు అన్యాయం చేసిందని, ఈ విషయంలో వారు జీవితాంతం చింతించాల్సి వస్తుందని మండిపడ్డారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై మోదీ స్పష్టంగా స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన మోదీ, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టాయని తెలిపారు. దేశంలోని ప్రతి గ్రామానికి ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మహిళల ఆశలను తుంగలో తొక్కినట్లయిందని, ఈ నిర్ణయం రాజకీయంగా కూడా విపక్షాలకు భారీ మూల్యం చెల్లింపజేస్తుందని హెచ్చరించారు.
మరోవంక, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో వీగిపోయేలా చేసిన విపక్షాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నీ ఈ నిరసనల్లో పాల్గొంటాయి. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శనివారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఆందోళనలు కొనసాగుతాయి.
మరోవైపు బిల్లు వీగిపోగానే ఎన్డీయే మహిళా ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. చట్ట సభల్లో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే చారిత్రక అవకాశాన్ని విపక్షాలు నీరుగార్చాయని ఆరోపించారు. బిల్లు ఆమోదం పొందకుండా రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నేతలు అడ్డుకున్నారని, తద్వారా మహిళలకు అన్యాయం చేశారని బీజేపీ ఎంపీ పూనమ్‌బెన్ ఆరోపించారు. దేశ మహిళలు రాహుల్ గాంధీని క్షమించబోరని చెప్పారు.
కాంగ్రెస్, ఇండి కూటమి నేతలు స్వార్థ రాజకీయ కారణాలు చూపుతూ మహిళా సాధికారతను అడ్డుకున్నారని బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ ఆరోపించారు. కాంగ్రెస్, ఇండి కూటమి నేతలు మహిళలను మోసగించారని చెప్పారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన తర్వాత ఎన్డీయే కూటమి మంత్రులు, నేతలు భేటీ అయ్యారు.
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, ఇతర బీజేపీ నేతలు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో సమావేశమయ్యారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో దీనిపై ఉధృతంగా ప్రచారం చేయాలని, రానున్న మూడు వారాలు ఇదే అంశంపై విపక్షాలను ఎండగట్టాలని నిర్ణయించారు. కాంగ్రె్‌సతో పాటు విపక్ష నేతల ఇళ్లను ఘెరావ్ చేయాలని కూడా బీజేపీ శ్రేణులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
More Stories
మణిపూర్ హింసాకాండ ఘటనలో 21 మంది అరెస్ట్
తమిళనాడు బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 23 మంది మృతి
పేలుళ్లకు కుట్రలో నలుగురు ఉగ్రవాదులు అరెస్టు