బీజేపీ నేత హత్య కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు

బీజేపీ నేత హత్య కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు
బీజేపీ నేత హత్య కేసులో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. బీజేపీ నేత యోగేష్‌ గౌడ్‌ హత్య కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్‌ కులకర్ణిని ప్రజా ప్రతినిధుల కోర్టు దోషిగా నిర్ధారించింది. 2016 నాటి ఈ హత్య కేసుపై సుదీర్ఘ విచారణ అనంతరం వినయ్‌ కులకర్ణితో పాటు 16 మందిని దోషులుగా తేల్చి, యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. 
 
ఎన్నికైన ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోశ్ గజానన్ భట్ బుధవారమే వినయ్ కులకర్ణిని, ఇతరులను నేరపూరిత కుట్ర, హత్యతో సహా వివిధ ఐపీసీ సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించారు.  ఈ హత్య కేసులో ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నందున సమాజానికి బలమైన సందేశం పంపేలా శిక్ష విధించాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శివానంద పెర్ల, ఎస్. హేమహద్‌లు వాదించారు. ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని విజ్ఞ‌ప్తి చేశారు. 
 
కానీ, వినయ్‌ కులకర్ణి తరఫున లాయర్లు మాత్రం ఆయనపై కనికరం చూపి శిక్ష తగ్గించాలని అభ్యర్థించారు. అయితే, నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. యావజ్జీవ శిక్షను ఖరారు చేశారు.  ధార్వాడ్ జిల్లా పంచాయత్ సభ్యుడైన యోగేష్‌గౌడ గౌడర్‌ 2016 జూన్ 15న జిమ్‌లో దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను దుండగులు కిరాతకంగా నరికి చంపారు.  అప్పట్లో ఈ ఉదంతం కర్ణాటకను కుదిపేసింది. 
 
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తర్వాత కేసును సీబీఐకి బదిలీ చేశారు. ఈ హత్య వెనుక అప్పటి ధార్వాడ్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న వినయ్ కులకర్ణి పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. తన రాజకీయ ప్రత్యర్థిని అణచివేసేందుకు ఈ హత్యను చేయించారనేది ఆరోపణ.  2016లో ఈ హత్య జరిగితే 2019లో సీబీఐకి బదిలీ చేశారు. 
 
దీనిపై 2020లో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ కులకర్ణిని ప్రధాన కుట్రదారుడిగా పేర్కొంది. తనకు రాజకీయంగా సవాల్‌గా మారుతాడని భావించిన కిరాయి హంతకులతో అడ్డు తొలగించుకున్నట్టు తెలిపింది. విచారణలో భాగంగా అదే ఏడాది కులకర్ణిని సీబీఐ అరెస్ట్ చేసింది. కానీ, ఆగస్టు 2021లో సుప్రీంకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. 
 
అయితే, సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో బెయిల్‌ను రద్దు చేసింది. జనవరి 2026లో వినయ్ కులకర్ణి బెయిల్ కోసం చేసిన తదుపరి అభ్యర్థనను న్యాయపరమైన చిక్కులను కారణంగా చూపుతూ కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. అప్పటికే సాక్షులందరినీ విచారించారని పేర్కొంటూ ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు ఆయనకు మళ్లీ బెయిల్ మంజూరు చేసింది.